CM KCR Prakash Raj : తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్‌కు రాజ్యసభ చాన్స్..? | Rajya Sabha Elections, Prakash Raj Name In CM KCR Mind

CM KCR Prakash Raj : తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్‌కు రాజ్యసభ చాన్స్..?

అనూహ్యంగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు రాజ్యసభ రేసులో తెరమీదకు వచ్చింది. సీఎం కేసీఆర్ పరిశీలనలో నటుడు ప్రకాశ్ రాజ్ పేరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.(CM KCR Prakash Raj)

CM KCR Prakash Raj : తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్‌కు రాజ్యసభ చాన్స్..?

CM KCR Prakash Raj : తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. దీంతో వారి స్థానంలో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఈసీ. దీనికి సంబంధించిన ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. జూన్ 10న పోలింగ్ జరుగుతుందని, అదే రోజున కౌంటింగ్ ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ నుంచి కెప్టెన్ లక్షీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్.. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సురేశ్ ప్రభు రిటైర్ కానున్నారు. ఖాళీ అవబోతున్న వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.(CM KCR Prakash Raj)

Rajya Sabha : దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్

తెలంగాణలో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. పదవీ కాలం పూర్తవుతున్న వారిలో ఇద్దరు బీసీలు, ఒకరు ఓసీకి చెందిన వారు ఉన్నారు. అన్నీ ఏకగ్రీవంగా టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, ఆ అభ్యర్థులు ఎవరు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఓ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక, పలువురు సీనియర్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లి నర్సింహులు, ఎస్టీ నుంచి సీతారాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీసీల నుంచి నారదాసు లక్ష్మణరావు, పీఎల్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాజ్యసభ రేసులో పారిశ్రామికవేత్తలు దామోదర్ రావు, సీఎల్ రాజం, హెటిరో సీఎండీ పార్థసారథి రెడ్డిల పేర్లు కూడా వినపడుతున్నాయి. అలాగే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేరు వినిపిస్తోంది. వీరు కాకుండా కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలచారి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు.

మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. అనూహ్యంగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు రాజ్యసభ రేసులో తెరమీదకు వచ్చింది. సీఎం కేసీఆర్ పరిశీలనలో నటుడు ప్రకాశ్ రాజ్ పేరు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ కొన్ని రోజులుగా కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ప్రకాశ్ రాజ్ పేరుని.. కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపించినట్లు అయితే.. పార్లమెంటులో బీజేపీ విధానాలను ఎండగట్టొచ్చు అనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Rajya Sabha Elections : ఏపీ నుంచి అదానీ భార్య, సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాదికి రాజ్యసభ చాన్స్‌?

తాజాగా రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ తోనే ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఫామ్ హౌస్ లో ప్రకాశ్ రాజ్ రెండు రోజులు గడిపినట్లు సమాచారం. ఈ క్రమంలో రాజ్యసభ రేసులో ప్రకాశ్ రాజ్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే చర్చ టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి, కేసీఆర్.. మనసులో ఏముంది? తెలంగాణ వాసులకు రాజ్యసభ ఛాన్స్ ఇస్తారా? ప్రకాశ్ రాజ్ కి ఇస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ప్రకాశ్ రాజ్ పేరు వినిపిస్తోందని చెప్పుకోవచ్చు. అయితే, రాబోయే ఎన్నికలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కూడా అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలో పార్టీ కోశాధికారిగా ఉన్న దామోదర్ రావు చివరి నిమిషం వరకు వినిపించింది. చివరి నిమిషంలో ఆయన పేరు వెనక్కి పడిపోయింది. ఈసారి మాత్రం దామోదర్ రావుకి కచ్చితంగా అవకాశం దక్కవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. మరో పారిశ్రామికవేత్త సీఎల్ రాజం.. సీఎం కేసీఆర్ కు దగ్గరవుతున్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాజంకు రాజ్యసభ అవకాశం దక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

×