Azim Premji On Telangana : తెలంగాణ‌లో మరిన్ని పెట్టుబ‌డులు పెడతాం – అజీమ్ ప్రేమ్‌జీ

కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్వాగతం చెబుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం(Azim Premji On Telangana)

Azim Premji On Telangana : తెలంగాణ‌లో మరిన్ని పెట్టుబ‌డులు పెడతాం – అజీమ్ ప్రేమ్‌జీ

Azim Premji On Telangana

Azim Premji On Telangana : మరో ప్రముఖ కంపెనీ తెలంగాణలోకి వచ్చింది. విప్రో సంస్థ త‌న కొత్త త‌యారీ యూనిట్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ హైద‌రాబాద్ శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను విప్రో చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్‌జీతో క‌లిసి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ-సిటీలో విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడారు. తెలంగాణ‌లో నిరంత‌రంగా పెట్టుబ‌డులు పెట్టే యోచ‌న‌లో ఉన్నామ‌ని అజీమ్ ప్రేమ్‌జీ తెలిపారు. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెరీ ఛార్మింగ్ అని ప్రేమ్‌జీ కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల‌కు ప్రోత్సాహ‌కంగా ఉంద‌ని కొనియాడారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో తెలంగాణ కీల‌కంగా నిలిచింద‌న్నారు. పెట్టుబ‌డుల‌తో స్థానిక యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు లభిస్తాయన్నారు. తాము స్థాపించ‌బోయే కంపెనీల్లో మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్రేమ్‌జీ తెలిపారు.(Azim Premji On Telangana)

”కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్వాగతం చెబుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం. అప్పుడు కూడా స్థానికుల‌కే ఉద్యోగ అవ‌కాశాలు ఇస్తాం. కంపెనీలు పెట్ట‌డానికి తెలంగాణ అనువైన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి మంచి స‌హకారం అందుతోంది. కంపెనీలు రావడం వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి” అని అజీమ్ ప్రేమ్ జీ అన్నారు. విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్ ని ఆ సంస్థ చైర్మ‌న్ అజీమ్ ప్రేమ్ జీతో క‌లిసి మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే

అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోందని.. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సరళీకృత విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. సుమారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఒక కంపెనీ రావాలంటే చాలా కష్టం ఉంటుందని.. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు కేటీఆర్.(Azim Premji On Telangana)

కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఒప్పందాలు జరిగాయని.. అలా జరిగితేనే స్థానికులకు ఉపయోగం ఉంటుందన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.

మ‌హేశ్వ‌రంలో అత్యాధునిక టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సంతూర్ స‌బ్బుల‌తో పాటు సాఫ్ట్ ట‌చ్ ఫ్యాబ్రిక్ కండిష‌న‌ర్‌ల‌ను విప్రో ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా స‌బ్బుల ఉత్ప‌త్తిని చేప‌ట్ట‌నుండ‌టం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్ర‌క‌టించింది.