Chilli Pests Cultivation : వాతావరణ మార్పులతో మిరపలో చీడపీడల ఉధృతి.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు 

Chilli Pests Cultivation : వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు.

Chilli Pests Cultivation : వాతావరణ మార్పులతో మిరపలో చీడపీడల ఉధృతి.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు 

Chilli Cultivation

Updated On : November 18, 2024 / 3:32 PM IST

Chilli Pests Cultivation : తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట పూత నుండి కాయదశలో ఉంది. ప్రస్థుతం కొన్ని ప్రాంతాలలో మిరప నుంచి తొలికాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో చీడపీడల తాకిడి ఎక్కువవటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి, సకాలంలో చీడపీడలు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితేనే నాణ్యమైన దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్టసాగులో మిరపను మించిన పంట మరొకటి లేదనేది అనాదిగా రైతుల్లో వున్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కానీ ఈ ఏడాది వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు పురుగులు,  వైరస్ తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని సకాలంలో గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మిరపకు ఆశించిన చీడపీడలు.. వాటిని ఏవిధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం..

మిరపలో పూత పురుగు గమనించడమైనది. నివారణకు, పూత దశలో వేప నూనె 5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉంటే కార్బోసల్ప్యూరాన్1.6 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చాలా చోట్ల తామర పురుగు గమనించడమైనది. దీనివల్ల మిరప లో పైముడత ఏర్పడుతుంది. దీని నివారణకు ఫిప్రోనిల్ 2 మి. లీ.  లేదా థయాక్లోప్రిడ్ 0.6 మి. లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు లేదా స్పైరోమేసిఫెన్ 1 మి. లీ. లేదా ఫెస్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. కొన్ని చోట్ల శనగపచ్చ పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని నివారణకు ఫ్లూబెండమైడ్  + థయాక్లోప్రిడ్ 0.5 మి. లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ + ఫిప్రోనిల్ 1.2 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి

మిరపలో ఎండుతెగులు నివారణ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ప్రొపికోనజోల్ 1 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో కొమ్మ ఎండుతెగులు గమనించడమైనది. నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1 మి. లీ. లేదా కాప్టాన్ + హెక్సాకొనజోల్ 2 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చాలాచోట్ల మిరపలో పొగాకు లద్దెపురుగు ఉధృతి పెరిగింది. నివారణకు నోవాల్యూరాన్ 0.75 మి. లీ. లేదా స్పైనోసాడ్ 0.25 మి. లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి. లీ. లేదా క్లోరాంట్రినిలి ప్రోల్ 0.3 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గమనించినట్లైతే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. + స్ట్రెస్టోసైక్లిన్ 0.1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. అక్కడక్కడ కోయినోఫోర కొమ్మకుళ్లు తెగులు గమనించడమైనది. దీని నివారణకు పైరాక్లోస్ట్రోబిన్ + మెటిరామ్ 3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు జెమిని వైరస్ తెగులు గమనించడమైనది దీనిని అరికట్టాలంటే వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. అలాగే పొలంలో ఉన్న కలుపు మొక్కలను నివారించాలి. ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 నుండి 10 చొప్పున అమర్చుకోవాలి. వైరస్ అధికంగా ఉంటే పైరిప్రాక్సిఫెస్ 1.5 మి. లీ. లేదా పైరిప్రాక్సిన్ + ఫెస్ ప్రోపాత్రిన్ 1 మి. లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Rabi Oilseed Crops : యాసంగి నూనెగింజల సాగులో మెళకువలు