Azolla Cultivation : రైతుల పాలిట కల్పతరువుగా అజొల్లా సాగు

అజొల్లా సేకరించిన తర్వాతకాని, ఎరువు మిశ్రమం కలిపినప్పుడుగాని మొక్కలు తిరగబడే అవకాశం వుంది, కాబట్టి, మొక్కలు నిలదొక్కుకునేందుకు వీలుగా ప్రతిసారీ పైనుంచి మంచినీరు చిలకరించంటం మరువకూడదు.

Azolla Cultivation

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు నిరంతరం ఆదాయాన్నిచ్చే పరిశ్రమగా పాడిపరిశ్రమ విరాజిల్లుతోంది. గతంలో బీడు భూములు అధికంగా వుండటంతో పచ్చిమేత కొరత వుండేది కాదు. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపధ్యంలో ఏడాదంతా పచ్చిమేత అందించలేక అధికంగా దాణాపై ఆధారపడాల్సిరావటంతో లాభదాయకంగా వున్న పాడి పరిశ్రమ కాస్తా రిస్కులో పడుతోంది. ఈ పరిస్థితుల్లో రైతుకు నిరంతర దిగుబడినిస్తూ అత్యధిక పోషకాలు కలిగిన పచ్చిమేతగా వెలుగొందుతోంది అజొల్లా. ఇది ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరంగా పశువైద్య నిపుణలు విశ్లేషిస్తున్నారు. కేవలం పాడి పశువులకే కాదు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు ఇలా అన్నింటి మేత అవసరాలు తీర్చగలగటమే అజొల్లా ప్రత్యేకత.

అజొల్లా ఆకు, పైతమ్మె భాగంలో నీలిఆకుపచ్చనాచు ఆశ్రయించి వుండటంతో పప్పుధాన్యాల పంటల్లాగే సహజీవన పద్ధతుల్లో నత్రజనిని స్థిరీకరిస్తుంది. అందువల్ల దశాబ్దాలుగా దీన్ని వరిపైరులో జీవన ఎరువుగా, పచ్చిరొట్ట ఎరువుగా వాడుతున్నారు. వరిపొలాల్లో అజొల్లా పెంచటంవల్ల హెక్టారుకు 30-40కి. నత్రజని సహజసిద్ధంగా అందుతుందని పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే అజొల్లాను పశువులకు కూడా మేపవచ్చిని తెలిసిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.

READ ALSO : Organic Farming : సేంద్రీయ వ్యవసాయంలో నత్రజని పోషక లోప నివారణకు చేపట్టాల్సిన చర్యలు

అజొల్లాను ‘పోషకాల గని’గా చెప్పవచ్చు. దీనిలో 25-35శాతం ప్రొటీన్లు వుంటాయి. ఇప్పటివరకు మేలైన గడ్డిజాతులుగా భావిస్తున్న బర్సీం, ల్యూసర్న్, అలసంద మొక్కలకంటే మంచి పోషణనిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. పశువుకు ఇచ్చే దాణాతో పోలిస్తే 2కిలోల అజొల్లా కిలో దాణాతో సమానమని తేలింది. మరి కిలో దాణాకయ్యే ఖర్చు కిలోకు 20రూ.లు. అదే అజొల్లాను 2కిలోలు ఉత్పత్తిచేయాలంటే కేవలం 2రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15-20శాతం పాల దిగుబడి పెరిగుతున్నట్లు రుజువైంది. పాలలో వెన్నశాతం కూడా పెరుగుతున్నట్లు రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి.

తమిళనాడు రాష్ట్రం, కన్యకుమారికి చెందిన సహజవనరుల అభివృద్ధిసంస్థ – నార్ డెప్, అజొల్లాపై విస్తృత పరిశోధనలు జరిపింది. దీనిలో అనేక రకాలు వున్నప్పటికి, వీరి పరిశోధనల్లోఅజొల్లా మైక్రోఫిల్లా నుంచి అధిక దిగుబడి వస్తున్నట్లు తేలింది. రైతు స్థాయిలో దీని పెంపకాన్ని అత్యంత సులభంగా చేపట్టవచ్చని గుర్తించారు. నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతి మొక్క ఇది. చిన్న చిన్న చెరువులు, కుంటల్లో కూడా త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఒక్కో మొక్క 2సెంటీమీటర్ల పొడవు, 2సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. కాండం అడుగున వుండే సహ వేరువ్యవస్థ క్రమంగా పైకిరావటంతో అది నీటిపై తేలియాడే నాచులా కన్పిస్తుంది.

READ ALSO : Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

సాధారణంగా ఒక పశువుకు రోజుకు రెండున్నర కిలోల అజొల్లా అవసరమవుతుంది. ఈ లెక్కన 5పశువులున్న రైతు ప్రతిరోజూ 12.5కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. తొట్లలో అజొల్లా పెంచినప్పుడు ఒక చదరపు మీటరుకు 300-350గ్రాములు అజొల్లా ఉత్పత్తవుతుంది. కనుక 12.5కిలోల అజొల్లా కావాలంటే 42చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైతు అజొల్లా పెంచాల్సివుంటుంది. దారి మురుగు నీటిపారుదల కోసం మరో 25 శాతం అదనపు విస్తీర్ణం కావాల్సివుంటుంది. అజొల్లాను పెంచే విధానం చూద్దాం..

అజొల్లా పెంపకం చేపట్టాలనుకునే రైతులు తొట్లను తయారు చేసుకునేటప్పుడు సరైన కొలతలను పాటించాలి. వారం పదిరోజుల్లోనే పెరిగే ఈ అజొల్లా, కేవలం పశువులకే కాకుండా కొళ్లకు, చేపలకు కూడా వేసి దాణా ఖర్చులను తగ్గించుకోవచ్చు. అజొల్లా పెంచే ప్రాంతంలో భూమి నలువైపులా చదరంగా వుండేటట్లు జాగ్రత్త వహించాలి. పెంపకానికి 10సెంటీమీటర్ల లోతు, 2.25మీటర్ల పొడవు, 1.5మీటర్ల వెడల్పువున్న తొట్లు అవసరం. నిర్ధేశించిన కొలతలు ప్రకారం గీసిన గీతల చుట్టూ ఒక వరుసలో, ఇటుకలను అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూపోవాలి. గుంతలో ఎక్కువగా వున్న నీరు బయటుకు పోయేవిధంగా ఇటుకలు పరిచేటప్పుడు మడిలో ఒక మూలన ఒక ఇటుకను బోర్లా పరిచి వుంచినట్లైతే ఎక్కువగా వున్న నీరు బయటకు పోయేందుకు అవసరమైన దారి ఏర్పడుతుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ఇటుకలే కాకుండా రైతులు తమకందుబాటులో వున్న వేటితోనైనా గోడ నిర్మాణం చేపట్టవచ్చు. ఈవిధంగా తయారుచేసుకున్న మడిలో కప్పటానికి 2.5మీటర్ల పొడవు, 1.75మీటర్ల వెడల్పు, 150gsm (జి.ఎస్.ఎమ్) మందంగల పాలిథిన్ షీట్ ఉపయోగించాలి. షీట్ చివరి అంచులు ఇటుకల పైకి వచ్చేటట్లు చూసి గాలికి లేవకుండా బరువు కప్పాలి. ఇప్పుడు చూస్తే ఇది తొట్టిలాగా కనబడుతుంది. తొట్టి లోతు 10సెంటీమీటర్లకు మించకూడదు. 30-35కిలోలో సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మెత్తని షీట్ మీద సమంగా పరవాలి. ఒక చదరపు మీటరుకు 10-15కిలోల మట్టి వుండేటట్లు చూసుకోవాలి. ఎరువుకోసం 4 నుంచి 5కిలోల పేడ తీసుకుని 15-20లీటర్ల నీటిలో కలపాలి. దీన్ని బాగా కలిపి తొట్టిలో నలువైపులా పోయాలి.

తొట్టిలో వేసిన మట్టి సారవంతమైనదైతే పోషకాల సమస్య వుండదు. లేని పక్షంలో పదికిలోల రాక్ ఫాస్ఫేట్ , 1.5కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 250-500గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కిలో పేడలో 5లీటర్లనీరు పోసి కలిపి దీనిలో ఇంతకుముందు తయారుచేసుకున్న పోషక మిశ్రమాన్ని 40గ్రాములు వేసి దీన్ని తొట్టిలో పోయాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష పోషకాలను కూడా అందించాల్సివుంటుంది. దీనికోసం మనం పశువుల దాణాలో వాడే మినరల్ మిక్ఛర్ 20గ్రాములు పేడతో కలిపి తొట్టెలో సమంగా పడేటట్లు చల్లాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7-10సెంటీమీటర్ల నీటిమట్టం వుండేటట్లు నీటితో నింపాలి. బెడ్ లో మట్టిని, నీటిని బాగా కలియదిప్పాలి. ఇక తొట్టి తయారైనట్లే.. 1-1.5కిలోల తాజా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంత సమంగా పడేటట్లు వెదజల్లాలి. తర్వాత మంచినీరు కొద్దికొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలతాయి. అజొల్లా తొట్లు చెట్లకింద వుంటే రాలిన ఆకులు తొట్లలో పడకుండా ఉండేందుకు దీనిపై నైలాన్ వల కప్పాలి.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

జాగ్రత్తగా పెంచుకుంటే అజొల్లా దాణాగా వాడుకోవటం కోసం నెలల తరబడీ వేచి ఉండక్కరలేదు. అజొల్లా త్వరగా పెరుగుతుంది. వారం పది రోజుల్లో తొట్టి మొత్తం ఆక్రమిస్తుంది. ఒక కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి పది కిలోలు వస్తుంది. 7వరోజునుంచి ప్రతిరోజూ కిలో నుంచి కిలోన్నర అజొల్లా సేకరించవచ్చు. 3రోజులకోసారి తీస్తే మాత్రం మూడునుంచి నాలుగున్నర కిలోలు ఒక తొట్టినుంచి సేకరించవచ్చు.

అజొల్లా శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారానే వృద్ధిచెందుతుంది. సాధారణంగా ప్రధాన అక్షం నిర్జీవమౌతున్నప్పుడు పక్కన వుండే కొమ్మలు ఒక మొక్కగా ఎదుగుతాయి. అజొల్లా నుండి పెద్ద మొత్తంలో వుత్పత్తి వస్తుంది కనుక సహజంగానే తొట్టిలో పోషకాలుకూడా త్వరత్వరగా అయిపోతుంటాయి. అందువల్ల అజొల్లా సేకరించిన ప్రతిసారీ ఒక లీటరు నీటికి 20గ్రాముల సూక్ష్మపోషక మిశ్రమాన్ని తొట్టిలో చల్లాలి. దీనితో పాటు 7రోజులకోసారి 1కిలో పేడ, 20గ్రా. మినరల్ మిక్స్చర్ ను 5లీటర్ల నీటిలో కలిపి తొట్టిలో పోయాలి. పోసిన వెంటనే కింద వున్న మట్టిని ఒకసారి కలియబెట్టాలి.

READ ALSO : Chamanti Cultivation : చామంతి సాగులో చీడపీడలు, తెగుళ్ళ నివారణ !

అజొల్లా సేకరించిన తర్వాతకాని, ఎరువు మిశ్రమం కలిపినప్పుడుగాని మొక్కలు తిరగబడే అవకాశం వుంది, కాబట్టి, మొక్కలు నిలదొక్కుకునేందుకు వీలుగా ప్రతిసారీ పైనుంచి మంచినీరు చిలకరించంటం మరువకూడదు. ప్రతి 10రోజులకొకసారి బెడ్ లో పావు వంతు నీటిని తీసివేసి కొత్తనీటితో నింపాలి. తొట్టిలో 7-10సెంటీమీటర్లు ఎత్తులో నీరు ఖచ్చితంగా వుండేటట్లు చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే వుండి మొక్క సరిగా పెరగదు. పోషకాల లభ్యత తక్కువగా వుంటుంది. తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్లు బారిన పడే అవకాశం వుంటుంది. 60రోజులకొకసారి తొట్లో 5కిలోల మట్టి తొలగించి తిరిగి కొత్తమట్టితో నింపాలి.

అజొల్లాను మేపేటప్పుడు పశువుకు అలవాటయ్యే విధంగా శుభ్రంగా కడిగిన తాజా అజొల్లాను 1:1నిష్పత్తిలో పశుదాణాలో కలిపి వాడవచ్చు. సాధరణంగా పశువుల్లో ప్రతి 5లీటర్ల పాలవుత్పత్తికి 2కిలోల దాణా వాడుతుంటాం. అజొల్లాను 2కిలోలు ఇచ్చినట్లయితే 1కిలో దాణా వాడకం తగ్గుతుంది అంటే నెలకు 600రూపాయల దాణా ఖర్చు తగ్గుతుంది. పైగా 20శాతం పాలదిగుబడి పెరుగుతుంది. 0.5 నుంచి ఒక శాతం వరకు వెన్నశాతం పెరుగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పశువునుంచి నెలకు 2000 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది. ఇంటి పెరట్లోగాని, తోటల్లోగాని, డాబాలపై గాని ఎక్కడైనా దీన్ని పెంచుకోవచ్చు. కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ వుండేటట్లు జాగ్రత్త వహించాలి.

READ ALSO : Soybean Cultivation : సోయాబీన్ సాగులో చీడపీడలు సస్యరక్షణ చర్యలు!

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రైతులు నాటుకోళ్లకే కాకుండా, బ్రాయిలర్, లేయర్ కోళ్ల, బాతుల దాణాలో 20-25శాతం అజొల్లా ను వాడి దాణా ఖర్చును గణనీయంగా తగ్గించుకోగలిగారు. క్వయిల్ పక్షుల దాణాలో 7శాతం వరకు అజొల్లా వాడి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అజొల్లా వాడటం వల్ల కోడి మాంసం ఉత్పత్తి పెరిగింది. గుడ్డు నాణ్యత మెరుగైంది. కేవలం పశుగణానికే కాదు చేపలకు కూడా అజొల్లా మంచిదాణా. గ్రాస్ కార్ప్ వంటి గడ్డితినే చేపలు అజొల్లాను ఇష్టంగా తింటాయి. ఎప్పటికప్పుడు తినేస్తుంటాయి కనుక చెరువులో అజొల్లా వృద్ధి అయ్యే అవకాశాలు తక్కువ. అందువల్ల వేరుగా పెంచుకుని మిగిలిన దాణాలాగే అవసరాన్నిబట్టి ఇస్తూ వుండాలి.

బయోగ్యాప్లాంట్లలో పశువుల పేడతోపాటు అజొల్లా కూడా కలిపితే బయోగ్యాస్ ఉత్పత్తి పెరుగుతున్నట్లు రుజువైంది. తాజా అజొల్లా పశుగణానికే కాదు, పంటలకు పచ్చిరొట్ట ఎరువుగా, సెంద్రీయ ఎరువుగా పనికొస్తంది. ఇలా చూసకుంటే సేద్యానికి సంబంధించిన అన్ని రంగాల్లో అజొల్లా వాడుకోవచ్చు. మీరు కూడా అజొల్లా పెంచాలను కుంటున్నారా అయితే అజొల్లా మదర్ కల్చర్ కోసం, మీ జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రం వారినిగాని, పశువైద్యులను గాని సంప్రదించవచ్చు.