Soil Fertile : పచ్చిరొట్ట పైర్ల సాగు… నేల సారవంతం బహుబాగు

పచ్చిరొట్ట పైరుగా జనుము ఎంతగానో దోహదపడుతుంది. ఇది అన్నిరకాల నేలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది.

Soil Fertile : పచ్చిరొట్ట పైర్ల సాగు… నేల సారవంతం బహుబాగు

Pachirotta

Updated On : August 16, 2021 / 10:25 AM IST

Soil Fertile : రసాయన ఎరువుల వాడకం నానాటికి పెరుగుతుంది. ఈ పరిణామంతో భూసారం తీవ్రంగా దెబ్బతింటుంది. పోషకాల లోపం కారణంగా పంటలు చీడపీడల బారిన పడుతూ రైతాంగం నష్టాలపాలవుతున్నారు. పొలాన్ని సారవంతంగా మార్చుకుని పంటలో అధిక దిగుబడులు సాధించుకునేందుకు పచ్చిరొట్ట పైర్ల సాగు అత్యావస్యకం. పొలంలో పంట సాగులో లేని సమయంలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేపట్టాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక రొట్టను ఇచ్చే పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలి.

పచ్చిరొట్ట పైర్లుగా జనుము, జీలుగ, పిల్లిసెసర, అలసంద, వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. లేత పూత దశలో ఉన్నప్పుడు పంటలను నేలలో కలియ దున్నాలి. అలా చేయటం ద్వారా నేలకు అనేక రకాల పోషకాలు అందుతాయి. భూసారం దెబ్బతినకుండా కాపాడటంతోపాటు, పంటల అధిక దిగుబడికి ఈ తరహా విధానం దోహదపడుతుంది.

పచ్చిరొట్ట పైరుగా జనుము ఎంతగానో దోహదపడుతుంది. ఇది అన్నిరకాల నేలల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 12 కిలోల నుండి 15 కిలోల విత్తనం అవసరమౌతుంది. 6టన్నుల వరకు పచ్చిరొట్ట దిగుబడి వస్తుంది. ఒక టన్ను జనుము పచ్చిరొట్ట 4కిలోల నత్రజని ఉంటుంది. దీని వల్ల భూమిలోపల పోషకాలు పెరుగుతాయి. పశువుల మేతగా కూడా దీనిని వినియోగించుకోవచ్చు.

క్షార గుణం గల చౌడు భూముల్లో , వరి పండించే భూముల్లో జీలుగను పచ్చిరొట్ట పైరుగా సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 12కిలోల విత్తనం అవసరం అవుతుంది. పూతదశలో పొలంలో దీనిని కలియదున్నాలి. ఎకరానికి 10 టన్నుల వరకు పచ్చిరొట్ట లభిస్తుంది. ఒక టన్ను జీలుగ నుండి 5కిలోల నత్రజని లభిస్తుంది.

పిల్లిపెసర కూడా పచ్చిరొట్ట ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 7నుండి 8కిలోల విత్తనం అవసరం అవుతుంది. 4టన్నుల వరకు పచ్చి రొట్ట వస్తుంది. ఇది చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. బరువైన నేలల్లో పిల్లిపెసరను పచ్చిరొట్ట పైరుగా సాగుచేపట్టవచ్చు.అలసంద పచ్చిరొట్ట పైరుగా బాగా ఉపయోగపడుతుంది. ఎకారానికి 6టన్నుల వరకు పచ్చిరొట్ట దిగుబడి వస్తుంది. పూతదశలో ఉన్నప్పుడు పొలంలో కలియదున్నుకోవాలి. టన్ను పచ్చిరొట్టలో 3కిలోలకు పైగా నత్రజని లభిస్తుంది.

పచ్చిరొట్ట పైర్ల సాగు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. భూమి సారవతంగా మారుతుంది. గుల్లగా మారి నేలలోకి వర్షపు నీరు ఇంకిపోయేందుకు దోహదపడుతుంది. పచ్చిరొట్ట ద్వారా నేలకు సేంద్రీయ పదార్ధాన్ని అందిచినట్లవుతుంది. తద్వారా సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేల సారవంతం అవుతుంది. జీవరసాయన చర్య జరిగిన పంటలకు అవసరమైన పోషకాలు అంది దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. జీలుగను పచ్చిరొట్ట పైరుగా సాగుచేస్తే వీటి వేర్లు ఎక్కవ లోతుకు వెళ్ళటం వల్ల భూమి పొరల్లో ఉన్న పోషకాలను బయటకు తీసుకువచ్చి పంటలకు అందిస్తాయి.