Silkworm Cultivation : రెండెకరాల్లో పట్టుపురుగుల పెంపకం – నెలకు రూ. లక్ష నికర ఆదాయం పొందుతున్న రైతు 

Pattu Purugu Pempakam : ప్రస్తుత పరిస్థితులలో రైతులను ఆదుకునే పంట ఏదైనా ఉందా అంటే అది పట్టుపురుగుల పెంపకమే. ఇటీవల పెరిగిన ధరలతో రైతులకు నికర ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి.

Silkworm Cultivation : రెండెకరాల్లో పట్టుపురుగుల పెంపకం – నెలకు రూ. లక్ష నికర ఆదాయం పొందుతున్న రైతు 

Pattu Purugu Pempakam

Updated On : September 17, 2024 / 2:39 PM IST

Pattu Purugu Pempakam : పట్టుపురుగుల పెంపకం రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. కొద్దిపాటి అవగాహనతో కష్టపడి పెంచిన రైతులకు సిరులు కురిపిస్తోంది. సంప్రదాయ పంటల్లో ఏడాదంతా ఎదురు చూసినా రాని ఫలితాలు. పట్టుపురుగుల పెంపకంలో అందుతున్నాయి. ప్రభుత్వ రాయితీలు కూడా వస్తుండటంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు.  ఇలా సాగు మెలకువలు, ప్రోత్సాహాలు అందిపుచ్చుకొని లాభాల బాటలో సాగుతున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ప్రస్తుత పరిస్థితులలో రైతులను ఆదుకునే పంట ఏదైనా ఉందా అంటే అది పట్టుపురుగుల పెంపకమే. ఇటీవల పెరిగిన ధరలతో రైతులకు నికర ఆదాయం అందిస్తోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీలు సైతం బాసటగా నిలుస్తున్నాయి. ఇలా ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకున్న మంచిర్యాల జిల్లా, చెన్నూర్ మండలం, లంబడిపల్లికి చెందిన రైతుల మధుకర్ పట్టుపురుగుల పెంపకంతో మంచి లాభాలు గడిస్తున్నారు. నూతన విధానాలను అందిపుచ్చుకుంటూ.. విజయాలు సాధిస్తున్నారు.

రైతులు ప్రధానంగా ఏడాదికి రెండు మూడు పంటలు మాత్రమే పండిస్తుంటారు. నీటి వసతినిబట్టి ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లో పంటలు వేస్తారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు దెబ్బ తింటే ఆ ఏడాదంతా రైతులు అప్పుల్లో కూరుకపోయి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే పట్టు సాగులో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు.

పట్టుపురుగుల పెంపకంలో కీలకమైన చాకీ పురుగుల పెంపకాన్ని మొదటి రెండు జ్వరాల వరకు జాగ్రత్తగా చూసుకుంటే  రైతుకు రిస్కు తగ్గిపోయింది. దీనివల్ల ప్రతి 25 రోజులకు ఒక పంట చొప్పున, ఏడాదికి 7 నుంచి 8 పంటలను రైతులు తీసేవీలు ఏర్పడింది. అందుకే రైతు మధుకర్ పట్టుపురుగల పెంపకం చేపట్టారు. ఇందుకోసం రెడుం ఎకరాల మామిడితోటలో అంతర పంటగా మల్బరీని పెంచుతున్నారు.

కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పట్టుశాఖ అన్నివిధాలుగా చేయూతనందిస్తోంది. రేరింగ్‌ గది నిర్మాణానికి సైజుల ఆధారంగా ప్రభుత్వం సబ్సిడీ  ఇస్తోంది. దీంతోపాటు రేరింగ్‌ పరికరాలకు రూ.75 శాతం రాయితీ ఉంది. క్రిమి సంహారక మందులు,  కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను 50శాతం రాయితీతో ఇస్తున్నారు. పట్టుకాయలు మార్కెట్‌కు తరలిస్తే, మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి  కిలోకు అదనంగా ప్రోత్సాహం ఇస్తుంది. దీంతో ఏడాదికి ఏడు, ఎనిమిది పంటలు తీస్తూ.. నెలనెల ప్రభుత్వ ఉద్యోగిలాగా మంచి జీతం పొందే అవకాశం ఏర్పడింది.

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ . ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే… పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో  ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడికోసం వెతుక్కోవాల్సిన పని లేదు.  గ్రామీణులు పట్టణాలకు వలసపోకుండా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు నిరోధించేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్దరైతు వరకు స్వయంసమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు