Ginger Crop Farming : ప్రస్తుతం అల్లంలో చేపట్టాల్సిన సస్యరక్షణ
Ginger Crop Farming : మే, జూన్ లో నాటిన అల్లం పంట ప్రస్తుతం 3 నుండి 4 నెలల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా దుంపకుళ్ళు, ఆకుముడత, మచ్చతెగులు చాలా చోట్ల ఆశించింది.

Ginger Crop Farming Guidance
Ginger Crop Farming : మన దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2 లక్షల 15వేల ఎకరాలు కాగా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు 25వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఔషధ, సుగంధ ద్రవ్యపంటగా అల్లం ప్రాధాన్యత నానాటికి పెరుగుతుండటంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు.
దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంటసాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మే, జూన్ నెలల్లో నాటిన అల్లం 3 నుంచి 4 నెలల దశలో వుంది. ఈ సమయంలో అల్లం సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో మంచి దిగుబడి వస్తుంది. తెలంగాణాలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోను, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగుచేస్తున్నారు.
ప్రధానంగా మారన్, మహిమ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతాంగం అల్లంసాగులో వినూత్న సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ ఎకరాకు 150 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ… ఇతర ప్రాంత రైతుల దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. గత రెండేళ్లుగా మార్కెట్ ధర ఆశాజనకంగా వుండటంతో చాలామంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో అల్లంసాగును ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు.
మే, జూన్ లో నాటిన అల్లం పంట ప్రస్తుతం 3 నుండి 4 నెలల దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా దుంపకుళ్ళు, ఆకుముడత, మచ్చతెగులు చాలా చోట్ల ఆశించింది. దుంపకుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందుతో పాటు మెటలాక్సిల్ లేదా మాంకోజెబ్ 5 గ్రా. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల పోయాలి. మందు ద్రావణం పోసేటప్పుడు మొక్కల మొదళ్లలో నేల తడిచేలా లోటాలతో పోయాలి. దీన్ని డ్రెంచింగ్ అంటారు.
తెగులు సోకిన మొక్కలతోపాటు ఆరోగ్యవంతమైన మొక్కలను కూడా ఈ మందు ద్రావణంతో తడపటం వల్ల దుంపకుళ్లు వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టవచ్చు. నిర్ధేశించిన మోతాదులో ఇతర ఎరువులతోపాటు వేప పిండిని అధికంగా వాడటం వల్ల దుంపకుళ్లు రాకుండా నిరోధించవచ్చు. అల్లానికి ప్రధాన శత్రువు మురుగు నీరు. అందువల్ల బోదెల్లో నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లోస్టిక్లా ఆకుమచ్చ తెగులు జులై నుండి ఆక్టోబర్ నెల వరకు అల్లం తోటల్లో గమనించవచ్చు. ఇది ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడుతాయి. తరువాత మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగు కలిగి యుండి మధ్య భాగము పసుపు రంగులోని మారును. ఆకులు పెళుసుగా మారుతాయి. అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకుల ఉపరితలంపై ఏర్పడి ఆకులు ఎండిపోవును.
దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ గల శిలీంద్రనాశిని అయిన బ్లైటాక్స్ మందును 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కలంతా తడిచేలా పిచికారి చేయాలి. ఆకుముడత పురుగు వీటి లార్వా ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు ప్రొఫెనోఫాస్ 1 మి. లీ. , లీటరు నీటికి కలిపి ఆకులపై పిచికారి చేయాలి. వేరుపురుగు ఇది ఆశించినట్లయితే దుంపల మొదళ్ళలో వేర్లను కత్తిరిస్తుంది. నష్టం గమనించగానే ఎకరాకు పోరేట్ 5 కిలోలు లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు 7 కిలోలు వేసి తీవ్రతను తగ్గించుకోవాలి.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..