Milk Fat Production : ముదురుతున్న ఎండలు.. పాలలో వెన్న శాతం పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Milk Fat Production : వాతావరణంలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వల్ల పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతమూ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

How To Feed for Milk Fat Production and Precautions in Cattle
Milk Fat Production : సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాలధర నిర్ణయిస్తారు. పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండడం సాధారణమే. అయితే పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండటం, ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల పాడి పశువులు సరిగా మేత తీసుకోవు. ఇలాంటి వాతావరణంలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వల్ల పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతమూ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Also : Sesame Cultivation : వేసవి నువ్వుకు చీడపీడలు ఆశించే అవకాశం.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
ఫిబ్రవరిలోనే మొదలైన ఎండలు :
వేసవి వస్తుందంటే చాలు పాడి రైతులు భయపడుతుంటారు. మండే ఎండలు, పచ్చిమేత కొరత, తాగునీరు లేక పోవడం తదితర కారణాలు పాడిగేదెలపై ప్రభావం చూపుతాయి. దీంతో రైతులు మార్చి నుంచి జూలై వరకూ పాలదిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతుంటారు. వర్షాభావం వల్ల ఈ ఏడాది ఎండలు ఒక నెల ముందుగానే మొదలవడంతో పాలు తగ్గుతున్నాయని పోషకులు చెప్తున్నారు. సాధారణంగా గేదె పాలలో వెన్నశాతం 6 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. అదే దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4 నుంచి 4.5 శాతం, సంకర జాతి పాడి పశువుల పాలలో 3 నుంచి 4 శాతం వరకు వెన్న ఉంటుంది.
పాలల్లో వెన్న శాతం పెరగాలంటే, పాడి పశువులకు ప్రతిరోజూ 30 నుండి 40 కిలోల వరకూ పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో మూడో భాగం 10 నుండి 15 కిలోల వరకు పప్పుజాతి పశుగ్రాసాలను, మిగతా భాగం 28 నుండి 30 కిలోల వరకు గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. ప్రతిరోజూ 6 నుండి 8 కిలోల వరకూ ఎండు గడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా జొన్నచొప్ప, సజ్జచొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా వాడటం మంచిది. ఈ చొప్ప లభ్యంకాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా ఎండు గడ్డిని వాడటం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది.
పాలలో వెన్న శాతం పెరగాలంటే? :
పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములు విడుదల చేసే సెల్యులోస్ అనే ఎంజైమ్‌ల వల్ల పీచుపదార్థం జీర్ణం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమై, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. అంతే కాకుండా పంట అవశేషాలను ఉపయోగించి, సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారుచేసి, పశువులకు మేతగా ఇవ్వాలి . ఇందులో పశువులకు కావలసిన పోషక పదార్ధాలు ఉండేటట్లు, ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశనగ చెక్కలు మొదలగు వాటిని ఉపయోగించి, దాణా మిశ్రమాన్ని తయారుచేసి ఇస్తే, పాడి పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి.
పాలలో వెన్న శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ఇటు దాణాకయ్యే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. పాడి పశువులకు దాణాను, పాల ఉత్పత్తిని బట్టి, పాలల్లో ఉండే వెన్న శాతాన్ని బట్టి, శరీరబరువును బట్టి ఇవ్వడం మంచిది. దాణా మిశ్రమంలో మొలాసిస్ కలిపి ఇస్తున్నప్పుడు 10 శాతం కంటే ఎక్కువగా కలపకూడదు. దాణా ఖర్చు ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాను పాడి పశువులకు మేతగా ఇవ్వాలి. రోజుకు కిలో నుండి కిలోన్నర వరకు అజొల్లాను దాణాలో కలిపి కూడా మేపవచ్చు. రోజుకు 20-25 లీటర్ల పాలిచ్చే పాడిపశువులకు దాణా మిశ్రమంతో పాటుగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అదనంగా ఈ బైపాస్ ఫ్యాట్‌ను రోజుకు 100 గ్రా.వరకూ ఇస్తే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది.
చివరి పాలను పూర్తిగా పిండాలి :
పాలు పిండేటప్పుడు చివరి ధారల్లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కనుక చివరి పాలను పూర్తిగా పిండాలి. పాడిపశువులు వట్టిపోయే ముందు ఇచ్చే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 4-5 నిమిషాలలో పాలను పూర్తిగా పిండాలి. వేసవిలో పాడి పశువుల పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, పోషణలో తగు జాగ్రత్తలు తీసుకుంటే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా, పాడి పశువుల, పెంపకందారులు అధిక లాభాలు పొందవచ్చు.
Read Also : Tomato Crop : టమాట తోటల్లో శనిగ పచ్చపురుగుల అరికట్టే పద్ధతి