ఫ్రూట్ కవర్స్‌తో మామిడి రైతులకు మంచి ఫలితాలు

ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ.. నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్ లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయంటున్నారు.

ఫ్రూట్ కవర్స్‌తో మామిడి రైతులకు మంచి ఫలితాలు

Mango Covers: పెరిగిన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే.. వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచె ఖర్చు ఎక్కువైన ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఏడాది మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ.. నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్ లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయంటున్నారు.

ఇదిగో ఇక్కడి మామిడి కాయలను చూడండీ.. ఎలాంటి మచ్చ, మరక లేదూ.. మంచి మెరుపుతో ఉన్నాయి. కాయంతా ఒకే రంగుతో ఉండి ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాయలను నాలుగు రూపాయలు ఎక్కువైనా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఈ కాస్పోటిక్ ఫ్రూట్ బ్యాగ్ వల్లే అంటున్నారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాపా శ్రీనివాసరావు.

మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడ ఉధృతి పెరిగింది. వాటిని నివారించేదుకు అధికంగా రసాయన మందులను పిచికారి చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రావడంలేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఉద్యాన అధికారులు నాలుగైదేళ్ల క్రితం మ్యాంగో కవర్స్ ను ప్రవేశ పెట్టారు.

Also Read: క్లోనింగ్ విధానంలో జామాయిల్ నర్సరీ – అధిక ఆదాయం పొందుతున్న రైతు

మొదట్లో సబ్సిడీ కింద కవర్లను సప్లై చేసిన అధికారులు ఆ తరువాత సబ్సిడీలు ఎత్తివేశారు. అయినా.. కొంత మంది రైతులు సొంత ఖర్చుతో కవర్లను కొనుగోలు చేసి సీజన్ లో మామిడి కాయలకు కట్టి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్ లో కాయలకు మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే సబ్సిడికింద కవర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.