Pests In Sorghum : జొన్నలో చీడపీడల నివారణ చర్యలు !

మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై, చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారటం గమనించవచ్చు.

Pests In Sorghum : జొన్నలో చీడపీడల నివారణ చర్యలు !

Measures to prevent pests in sorghum!

Pests In Sorghum : చిరుధాన్యపు పంటల సాగులో జొన్న కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో రైతులు జొన్న సాగును విస్తారంగా చేపడుతున్నారు. ముఖ్యంగా జొన్న సాగుకు నల్లరేగడి మరియు తేలికైన ఎర్రనేలలు అనుకూలంగా ఉంటాయి. ఎకరాకు 3-4 కిలోల విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ లేదా కాప్టాన్‌ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెం.మీ; వరుసలో మొక్కల మధ్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. పంటసాగుకు ముందుగా పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి.

సస్యరక్షణ చర్యలు ;

మొవ్వు తొలుచు పురుగు: ఈ పురుగు ఆశిస్తే మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వుని లాగినపుడు సులువుగా వచ్చి, కుళ్ళిపోయిన వాసన వస్తుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఖరీఫ్‌ జొన్నని జూలై 15వ తారీఖు లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసివస్తే, విత్తన మోతాదును పెంచి, మొవ్వఈగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. కార్బోఫ్యురాన్‌ 3జి. గుళికలను మీటరు సాలుకు 2గ్రా. వంతున విత్తేటపుడు సాళ్ళలో వేయాలి లేదా ఎండోసల్ఫాన్‌ 35 ఇ.సి. 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7, 14 మరియు 21 రోజుల్లో పిచికారి చేయాలి. మొక్కకు 5 వారాల వయసు వచ్చే వరకు ఈ పురుగు ఆశిస్తుంది.

కాండం తొలుచు పురుగు : ఈ పురుగు, పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసేవరకు ఆశిస్తుంది. గుండ్రని వరస రంధ్రాలు ఆకులపై ఏర్పడతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే తెగుళ్ళు ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుండి బయటకు రాదు. నివారణకు విత్తిన 35-40 రోజులలోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యురాన్‌ గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి.

కంకినల్లి : పిల్ల, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో రసం పీల్చటం వలన ఆశించిన గింజలు నొక్కులుగా మారి కంకిలో కొన్నే మంచి గింజలు వుంటాయి. గింజల మీద ఎరుపు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారిపోతాయి. గింజలు గట్టిపడిన తర్వాత ఈ పురుగు ఆశించదు. దీని నివారణకు తొలిదశలోనే కంకి నల్లిని గుర్తించి, ఎకరాకు 8 కిలోల కార్బరిల్‌ 5% పొడిమందును కంకుల మీద చల్లుకోవాలి.

గింజబూజు : గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడటం వల్ల నష్టం అధికంగా వుంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్ర రకాన్ని బట్టి వాటిపై గులాబి లేదా నల్లని బూజు పెరుగుదల గమనించవచ్చు. అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బ తింటాయి. దీని నివారణకు గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినపుడు కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రా. కాప్టాన్‌తోపాటు, 2 గ్రా.ల ఆరియోఫంగిన్‌ను గాని లేక లీటరు నీటికి 0.5 మి.లీ. ప్రోపికొనజోల్‌ గాని కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికారీ చేయాలి.

బంకకారు తెగులు : మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘావృతమై, చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తియ్యటి జిగురు వంటి ద్రవం కారటం గమనించవచ్చు. దీని నివారణకు 3 గ్రా. కాప్టాన్‌ లేక థైరమ్‌ కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. లీటరు నీటికి మాంకోజెబ్‌ 2 గ్రా. లేదా బెన్‌లేట్‌ 1 గ్రా. లేదా ప్రోపికొనజోల్‌ 0.5 మి.లీ. కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పూతదశలో చల్లుకోవాలి.

పేనుబంక : జొన్న పంటను పేను బంక ఆశిస్తుంది. నివారణకు మిథైల్‌ డెమటాన్‌ లేదా డైమిథోయేట్‌ లేదా మలాథియన్‌ 5% మందుల్లో ఏదోఒకదానిని 1 లీ. నీటికి 2 మి.లీ. వంతున కలిపి పిచికారి చేయాలి.