Organic Burma Rice Crop : ప్రకృతి విధానంలో బర్మాబ్లాక్ రైస్ సాగు – అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

Organic Burma Rice Crop : ఆహారమే తొలి ఔషధం అంటారు పూర్వీకులు. తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను, సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా పరిరక్షించారు.

Organic Burma Rice Crop : ప్రకృతి విధానంలో బర్మాబ్లాక్ రైస్ సాగు – అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

Organic Burma Black Rice Crop Cultivation

Updated On : November 20, 2024 / 3:11 PM IST

Organic Burma Rice Crop : అంతరించిపోతున్న దేశీయ వరి వంగడాల సాగు, తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. అధిక పోషక విలువలు ఉండటం.. పెట్టుబడి కూడా తగ్గడం.. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు వీటి సాగుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు, ప్రకృతి విధానంలో బర్మాబ్లాక్ రైస్ సాగుచేపట్టారు. మరికొద్ది రోజుల్లో కోతకోయనున్న ఈ పంట, అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆహారమే తొలి ఔషధం అంటారు పూర్వీకులు. తమకు అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాల వంగడాలను, సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా పరిరక్షించారు. ఆధునిక శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందుబాటులోకి తేవడంతో,  ఔషధ విలువలతో కూడిన సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విశిష్ట ఔషధ విలువలతో కూడిన దేశీ వరి వంగడాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి సాగు మళ్లీ విస్తృతమవుతోంది. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, సుంకొల్లు గ్రామానికి చెందిన రైతు అరివే కృష్ణ వేణి రెండేళ్లుగా పూర్తిగా ప్రకృతి సేద్యం విధానంలో బర్మా బ్లాక్ రైస్ సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు

నల్ల బియ్యం.. ఇటీవల ప్రజల్లో బాగా నానుతున్న పదం. ఆరోగ్యంపట్ల జనాల్లో శ్రద్ధ పెరుగుతుండటంతో కొత్తరకం పంటలు తెరపైకి వస్తున్నాయి. ఈ కోవలోనే రెండుమూడేళ్లగా అనేక దేశీవరి రకాలు సాగులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యమైన రకం బర్మాబ్లాక్. రెండేళ్లుగా పూర్తిగా ప్రకృతి విధానంలో పండిస్తూ.. మంచి లాభాలను ఆర్జిస్తోంది రైతు అరివే కృష్ణ వేణి. మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని బ్లాక్ రైస్ తో పాటు తెలంగాణ సోనా అయిన ఆర్.ఎన్.ఆర్ -15048 (పదిహేను సున్నా నలబై ఎనిమిది)ని ఎకరంలో సాగుచేస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువుల జోలికి పోకుండా.. కేవలం పశువుల వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులు, కషాయాలను పంటలకు పిచికారి చేస్తున్నారు. అంతే కాదు… నీటి సౌకర్యం లేని ఈ ప్రాంతంలో ఆరుతడిగా పండిస్తూ… తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అధిక ధరకు అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

ఇతర రకాల ధాన్యం కంటే బ్లాక్‌ రైస్‌ దిగుబడి తక్కువగా ఉంటుంది. సాధారణ రకాలు ఎకరానికి 25 నుండి35 బస్తాల దిగుబడి వస్తే.. బర్మా బ్లాక్‌ మాత్రం రైస్‌ 15 నుండి 20 బస్తాలు మాత్రమే వస్తాయి. అయితే ధరలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణ రకం బియ్యం కిలో రూ. 40 ఉంటే బర్మా బ్లాక్‌ రైస్‌ మాత్రం కిలో ధర రూ.200 పలుకుతోంది. అంటే దిగుబడి తక్కువగా వచ్చినా.. పెట్టుబడి లేకపోవడం.. సాధారణ రకాలతో పోల్చితే అధిక లాభాలను ఆర్జిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కృష్ణవేణి.

Read Also : Brinjal Crop Cultivation : వంగతోటల్లో తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర యాజమాన్యం