Paddy Cultivation : మామిడితోటలో అంతర పంటగా వరిసాగు – అధిక లాభాలు పొందుతున్న రైతు
Paddy Cultivation : ఈ విధానాలనే పాటిస్తూ.. మామిడి తోటలో అంతరపంటగా వరిసాగుచేస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

Paddy Cultivation in Mango Farm
Paddy Cultivation : మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు.
ముఖ్యంగా పండ్లతోటలు సాగు చేసే రైతులు అంతర పంటల ద్వారా అధిక లాభాలను పొందుతున్నారు . ఈ విధానాలనే పాటిస్తూ.. మామిడి తోటలో అంతరపంటగా వరిసాగుచేస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
ఉన్నది ఐదు ఎకరాల వ్యవసాయ భూమి. దాంట్లో 4 ఎకరాల్లో మామిడి తోట. ఏడాదికి ఒక సారే పంట దిగుబడి. అప్పటి వరకు ఆదాయం రాదు. మరి ఉన్న భూమిని ఎలా వాడాలి, ఎలా ఆదాయం పొందాలి అని ఆలోచించారు ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, బత్తులవారి గూడెం గ్రామానికి చెందిన రైతు ముసునూరు రాజబాబు. మామిడితోటలో అంతర పంటలు సాగుచేయాలనుకున్నారు. తనకున్న 4 ఎకరాల మామిడితోటలో ప్రయోగాత్మకంగా వరి సాగుచేస్తున్నారు. దిగుబడి పర్వాలేదనిపించడంతో ప్రతి ఏటా ఖరీఫ్ లో వరిసాగుచేస్తూనే ఉన్నారు.
అయితే ఆరోగ్యం కాపాడుకునేందుకు రసాయనాలు లేని ఆహారం తిలాలనుకొని గత 4 ఏళ్లుగా ఎలాంటి రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది దేశీ వరిరకాలతో పాటు బిపిటి రకాన్ని సాగు చేపట్టారు.. కొన్ని రకాలు కోతకు సిద్ధం కాగా.. మరికొన్ని రకాలు మాత్రం మరో 20 రోజుల్లో చేతికి రానున్నాయి.
అయితే ఈ రైతు గత నాలుగేళ్లుగా సాగులో ఎలాంటి రసాయన మందులను వాడటం లేదు. కేవలం ప్రకృతి సహాజంగా తయారుచేసిన ఎరువులు, పురుగుమందులనే వాడుతున్నారు. దీంతో పెట్టుబడి పూర్తిగా తగ్గుతోంది. దిగుబడి తగ్గినా.. పెట్టుబడి లేకపోవడంతో.. లాభాలు అధికంగా వస్తున్నాయి. అంతే కాదు రసాయన మందులు లేని ఆహారాన్ని తింటూ అరోగ్యంగా ఉంటున్నారు రైతు.
రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. రసాయనాలు వద్దు – ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతి సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ… అధిక దిగుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
Read Also : Groundnut Cultivation : వేరుశనగ పంటలో.. పాటించాల్సిన మెళకువలు