Papaya Harvesting : పెరిగిన బొప్పాయి వినియోగం – కోతల తరువాత కొన్ని జాగ్రత్తలతో మార్కెట్లో అధిక ధర!
papaya harvesting : సాధారణంగా బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై, మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది.

Techniques in papaya harvesting
Papaya Harvesting : ఒకప్పుడు పెరటి మొక్కగా వున్న బొప్పాయి, తైవాన్ రకాల రాకతో తోటకలను సంతరించుకుంది. దీనిసాగు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఈపంట సాగులో దిగుబడులు ఆశాజనకంగానే వున్నా, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, వైరస్ తెగుళ్ళు. వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలతో అరికడుతూ, ఎకరానికి 100 టన్నుల దిగుబడులు సాధించిన రైతులూ వున్నారు. బొప్పాయిని సాగు చేయటం పైనే కాదు, కోతల అనంతరం కూడా సరైన మెలకువలు పాటించినప్పుడే మంచి రాబడులు పొందగలం. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..
తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం 70వేల ఎకరాలకు పైగా వుంది. ఒకప్పుడు ఇంటిపెరట్లోనో, పొలం గట్లపైనో వున్నబొప్పాయికి, ఇంతగా ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలే అని చెప్పక తప్పదు. దీనికితోడు రిటైల్ మార్కెట్లు, సూపర్ మార్కెట్ల రాకతో దీనిసాగు వాణిజ్యరూపును సంతరించుకుంది. ప్రస్తుతం బొప్పాయి అన్ని సీజన్ లలో అందుబాటులో వుండే పండు.
ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావటం, ఆరోగ్యానికి మేలుచేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా వుండటం వల్ల బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దీని వాడకం విస్తృతమవటం, మార్కెట్ డిమాండ్ పెరగటంతో రైతుకు బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది. సాధారణ బొప్పాయి రకాలకంటే, తైవాన్ సంకర రకాలు 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడినిస్తుండటంతో బొప్పాయిసాగు మరింతగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా వుండటం, పెనుగాలుల తాకిడిని తట్టుకునే స్వభావం వుండటంతో రైతులకు సాగులో సమస్యలు చాలా వరకు తగ్గాయి.
సాధారణంగా బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై, మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడులనిస్తుంది. ముఖ్యంగా బొప్పాయి కోతలు అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్లదూరం పైన ఆధారపడి వుంటుంది. లోకల్ మార్కట్లకే కాక డిల్లి, ముంబాయి వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో వుంచుకుని, అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు కొందరు రైతులు. పంపే మార్కెట్ ఏదయినా కోతల సమయంలో కొన్ని మెలకువలు తప్పనిసరి. సాధారణంగా, వినియోగదారులు మధ్యస్థ సైజులో వున్న కాయలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు.
దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు, కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే, కాయలు కోసుకోవాలి. అదే దగ్గరి మార్కెట్లకు పంపేటపుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత వాటినుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. లేదంటే కాయలపై మచ్చలుగా ఏర్పడి నాణ్యత దెబ్బతినే అవకాశం వుంది. ఇలా పూర్తిగా ఆరిన కాయలను ప్యాకింగ్ చేసుకోవాలి.
ఇందుకోసం ఒక్కోకాయకు విడివిడిగా న్యూస్ పేపర్ ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగుభాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా వుంటాయి. కాబట్టి రైతులు పంట పండించటం పైనే కాక, కోతల అనంతరం కూడా అన్ని జాగ్రత్త చర్యలను పాటించినట్లయితే, మంచి నాణ్యమైన ఉత్పత్తులు పొంది తద్వారా మంచి రాబడులను పొందినవాళ్ళమవుతాం.
Read Also : Castor oil Cultivation : ఆముదంలో చీడపీడల అరికట్టే పద్ధతులు