వచ్చే ఐదేళ్లలో 5 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం, రాష్ట్రాల మధ్య తగ్గనున్న ప్రయాణ దూరం, రాజమండ్రి టు హైదరాబబాద్ 5 గంటలే

  • Publish Date - August 26, 2020 / 10:56 AM IST

ఏపీలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 5 గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మితం కానున్నాయి. సరకు రవాణా వాహనాలకు అనువుగా ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గించాలనే లక్ష్యంతో వీటిని నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే పొరుగు రాష్ట్రాలతో పాటు, ఉత్తరాదికి వేగంగా చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో వీటిని తక్కువ దూరమే నిర్మిస్తున్నా… అవి పొరుగు రాష్ట్రాలతో అనుసంధానానికి కీలకం కానున్నాయి. వీటిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 2024-2025 నాటికి పూర్తి చేయనుంది.

1 విశాఖ – రాయ్‌పుర్‌
మన రాష్ట్రంలో ఎంత దూరం: విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 100 కి.మీ. ఉంటుంది. విశాఖ జిల్లా సబ్బవరం దగ్గర మొదలై కొత్తవలస, విజయనగరం, సాలూరు మీదుగా ఒడిశా సరిహద్దు వరకు ఉంటుంది. మన పరిధిలో నిర్మాణానికి రూ.2,300 కోట్లు వ్యయమవుతుందని అంచనా.

2 దేవరాపల్లి -ఖమ్మం – సూర్యాపేట
మన రాష్ట్రంలో: దేవరాపల్లి నుంచి లింగగూడెం (తెలంగాణ సరిహద్దు) వరకు 72 కి.మీ. నిర్మిస్తారు.

3. విజయవాడ – నాగ్‌పుర్‌
మన రాష్ట్రంలో: ఖమ్మం-విజయవాడ మధ్య 91 కి.మీ. నిర్మించనున్నారు. ఇందులో కృష్ణా జిల్లా పరిధిలో 31 కి.మీ. ఉంటుంది.

4. రేణిగుంట – కడప
మన రాష్ట్రంలో: రేణిగుంట-కడప మధ్య 120 కి.మీ. మేర నాలుగు వరుసలు నిర్మిస్తారు. ఇందులో 100 కి.మీ. కొత్తది. మిగిలిన 20 కి.మీ.లు ప్రస్తుతం ఉన్న దానిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు.

5. చిత్తూరు – తచ్చూరు (తమిళనాడు)
మన రాష్ట్రంలో: చిత్తూరు జిల్లా పరిధిలో 83 కి.మీ. నిర్మిస్తారు.

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేల ప్రత్యేకతలు:
* నిరాటంకంగా వెళ్లేలా ఏర్పాట్లు.
* ప్రస్తుతం ఉన్న రహదారితో సంబంధం లేకుండా కొత్తగా మరొకటి నిర్మిస్తారు.
* సాధ్యమైనంత వరకు మలుపులు తక్కువగా ఉండేలా చూస్తారు.
* ఈ రహదారులను ప్రారంభమైన చోటు నుంచి గమ్యస్థానానికి వీలైనంత తక్కువ దూరంలో నేరుగా వెళ్లేలా నిర్మిస్తారు.
* ప్రతి గ్రామం, పట్టణ పరిధిలో కొన్నిచోట్ల మాత్రమే వాహనాలు ఈ రహదారిపై చేరేందుకు, బయటకు వచ్చేందుకు వీలు కల్పిస్తారు. సగటున 100-120కి.మీ. వేగంతో వెళ్లవచ్చు.

విశాఖ-రాయ్‌పుర్‌
* ప్రాజెక్ట్‌ పేరు: రాయ్‌పుర్‌-విశాఖపట్నం
* దూరం: 464 కి.మీ. ఆరు వరుసలు
* ప్రస్తుతం ఉన్న మార్గం: 557 కి.మీ. రెండు వరుసల్లో ఉంది.
* ప్రయోజనం: విశాఖ నుంచి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌కు వేగంగా చేరుకునేందుకు వీలుంటుంది. 93 కి.మీ. దూరం తగ్గుతుంది.

నాగ్‌పుర్‌కు వేగంగా చేరుకునేలా..
* పేరు: నాగ్‌పుర్‌-విజయవాడ
* దూరం: 457 కి.మీ. నాలుగు వరుసలు.
* ప్రస్తుతం ఉన్న మార్గం: విజయవాడ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లేందుకు సూర్యాపేట, హైదరాబాద్‌ మీదుగా జాతీయ రహదారులు-65, 44లో ప్రయాణించాల్సి ఉంటోంది. దీని దూరం 772 కి.మీ.
* కొత్త ప్రణాళిక: విజయవాడ నుంచి ఖమ్మం, మంచిర్యాల మీదుగా వెళ్తుంది.
* ప్రయోజనం: ఉత్తరాదికి అనుసంధానం పెరిగి దూరం తగ్గనుంది.

చెన్నై-సూరత్‌కు…
* పేరు: రేణిగుంట-కడప
* దూరం: 120 కి.మీ. నాలుగు వరుసలు.
* ఉద్దేశం: చెన్నై నుంచి ముంబయి, సూరత్‌కు దూరం తగ్గించడం
* ప్రస్తుత మార్గం: చెన్నై నుంచి బెంగళూరు, దావణగెరె, కొల్హాపుర్‌, పుణె, ముంబయి మీదుగా సూరత్‌కు వాహనాలు వెళ్తున్నాయి. అలాగే నెల్లూరు, నల్గొండ, హైదరాబాద్‌, సోలాపుర్‌, పుణె మీదుగా కూడా ముంబయికి వెళ్తుంటాయి.

దూరం ఎలా తగ్గిస్తారు: ప్రత్యామ్నాయంగా రేణిగుంట, కడప, నంద్యాల, కర్నూలు, మహబూబ్‌నగర్‌, కలబుర్గి, అక్కల్‌కోట్‌, సోలాపూర్‌, అహ్మద్‌నగర్‌, నాసిక్‌ మీదుగా సూరత్‌కు వాహనాలు వెళ్లేలా చూడనున్నారు. ఈ మార్గంలో సోలాపుర్‌ నుంచి పుణె మీదుగా ముంబయి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దాదాపు 100-120 కి.మీ. దూరం తగ్గనుంది.
https://10tv.in/german-halle-university-researchers-stage-crowded-concert-to-study-spread-of-covid-19-at-large-gatherings/
చెన్నైకి సులువుగా చేరేందుకు..
* పేరు: చిత్తూరు-తచ్చూరు (తమిళనాడు)
* దూరం: 126 కి.మీ.లు. ఆరు వరుసలు
* ఎలా వెళ్తుంది: చిత్తూరు నుంచి జీడీ నెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, నగరి, నిండ్ర, పిచ్చాటూరు, నాగలాపురం తదితర మండలాల మీదుగా తమిళనాడులోని చెన్నై బైపాస్‌లో కలుస్తుంది.
* ప్రయోజనం: బెంగళూరు, చిత్తూరు వైపు నుంచి చెన్నైలోని కామరాజార్‌ (ఇన్నోర్‌), కట్టుపల్లి నౌకాశ్రయాలకు వెళ్లే సరకు రవాణా వాహనాలు నేరుగా చేరుకునేందుకు వీలవుతుంది.

ఉత్తర కోస్తా నుంచి హైదరాబాద్‌కు వేగంగా..
పేరు: సూర్యాపేట-ఖమ్మం-దేవరాపల్లి
* దూరం: 168 కి.మీ.లు.
* ఎటువైపు వెళ్తుంది: ఉత్తర కోస్తా జిల్లాలు, తూర్పుగోదావరికి చెందిన వాహనాలు హైదరాబాద్‌కు కొవ్వూరు నుంచి దేవరాపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి నుంచి ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్తున్నాయి. విశాఖ నుంచి వేగంగా హైదరాబాద్‌ చేరుకునేందుకు నిర్మిస్తున్నారు.
* ప్రయోజనం: ఇప్పటికే కొవ్వూరు నుంచి దేవరాపల్లి వరకు నాలుగు వరుసల నిర్మాణం జరుగుతోంది. కొత్తది కూడా పూర్తయితే.. రాజమహేంద్రవరం నుంచి 5 గంటలలోపే హైదరాబాద్‌ చేరుకోవచ్చు.