Chandrababu Naidu: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?: చంద్రబాబు 

కొందరు ఉద్దేశపూర్వకంగా ఎరువులను మళ్లించి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Chandrababu Naidu: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?: చంద్రబాబు 

Chandrababu Naidu

Updated On : September 3, 2025 / 8:28 PM IST

Chandrababu Naidu: నేరాలను నమ్ముకున్న ఫేక్ పార్టీ విష ప్రచారం వ్యాప్తి చేయటమే పనిగా పెట్టుకుందంటూ వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ప్రతి రైతుకు సకాలంలో యూరియా సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అయితే.. కొందరు ఉద్దేశపూర్వకంగా ఎరువులను మళ్లించి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొన్ని చోట్ల ఫేక్ మనుషుల్ని పంపించి గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ మనుషులు ఉద్దేశపూర్వకంగా ఎరువులు హైజాక్ చేసి గొడవకు పాల్పడ్డారని తెలిపారు.

రాష్ట్రంలో నేటి వరకు 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. వచ్చే 10 రోజుల్లో 44,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని అన్నారు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టిస్తే వారి సంగతి తేలుస్తామని చెప్పారు.

పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. గుడ్డ కాల్చి ముఖాన పడేసి, తుడుచుకోండనే పిచ్చి పిచ్చి ఆటలు వైసీపీ ఆడొద్దని హెచ్చరిస్తున్నానని అన్నారు.

గత పది రోజుల్లో 28 వేల మెట్రిక్ టన్నుల సరఫరా జరిగిందని చెప్పారు. 2 లక్షల 71 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

విజిలెన్సు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు. 1,284 మెట్రిక్ టన్నుల యూరియా కూడా సీజ్ చేశామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, భవిష్యత్ అవసరాలకు కూడా అవసరమైన సరఫరా చేస్తామని అన్నారు.

ప్రతిపక్ష హోదాను ప్రజలివ్వాలి

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని అనడానికి బుద్ధి ఉండాలని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదాను తానివ్వాలా? ప్రజలిస్తారా? అని అన్నారు. తనకు ముఖ్యమంత్రి హోదా ప్రజలిచ్చారని, 19 సీట్లు ఉంటే కానీ సాధ్యంగాని ప్రతిపక్ష హోదాను జగన్ కు ప్రజలివ్వలేదని చెప్పారు. గతంలో ఓసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదని అన్నారు.