Prof Santhamma : హ్యాట్సాఫ్ ప్రొఫెసర్ శాంతమ్మా..94 ఏళ్ల వయసులో 130 కి.మీటర్లు ప్రయాణించి పాఠాలు చెబుతున్న అలుపెనుగని అధ్యాపకురాలు

94 ఏళ్ల వయసులో 130 కి.మీటర్లు ప్రయాణించి పాఠాలు చెబుతున్నారు అలుపెనుగని అధ్యాపకురాలు ప్రొఫెసర్ శాంతమ్మ.తన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే ఆమె లక్ష్యం. అందుకే 94 వయసులోనూ ఆమె విజయనగరంలోని సెంచురియన్ యూనివర్సీటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

PROF santhamma : చదువుకి వయసుతో సంబంధం లేదు. 9 పదుల వయసులోనైనా చదువుకోవచ్చు… లేదంటే చదువు చెప్పొచ్చు. దీనికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలిచారు ప్రొఫెసర్ శాంతమ్మ. 94 ఏళ్ల వయసులో ఏకంగా 130 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. 33 ఏళ్ల క్రితమే ప్రొఫెసర్‌గా రిటైర్ అయినా.. ఇంకా విద్యార్థులకు ఏదో నేర్పించాలన్న ఆమె తపనకు అంతా హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు.

94 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణా రామ అంటూ శేష జీవితాన్ని గడిపేస్తారు. కానీ ప్రొఫెసర్‌ శాంతమ్మ ఆటైపు కాదు. తన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే ఆమె లక్ష్యం. అందుకే 94 వయసులోనూ ఆమె విజయనగరంలోని సెంచురియన్ యూనివర్సీటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నిజానికి శాంతమ్మ 1989లోనే పదవి విరమణ పొందారు. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. మళ్లీ ఏయూలోనే గౌరవ అధ్యాపకురాలిగా సేవలు అందించారు. ఇప్పుడు 130 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. వైజాగ్ నుంచి విజయనగరంలోని కాలేజీకి రానుపోను 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. 94 ఏళ్ల వయసులో రోజూ అంత ప్రయాణం చేయడం చాలా కష్టం. అయినా వాటిని లెక్క చేయకుండా ఆమె విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

నాలుగు పదుల వయసు దాటితే చాలు ఆటోమేటిక్‌గా మోకాళ్ల నొప్పులు వచ్చేస్తాయి. మరి తొమ్మిది పదుల వయసు ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రొఫెసర్ శాంతమ్మకు కూడా అదే సమస్య ఉంది. రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ చేశారు. అయినా.. ఆమె చేతి కర్రల సాయంతో నడక సాగిస్తున్నారు. మనకి ఇష్టమైన పని చేసినప్పుడు కష్టం కనిపించదు. శాంతమ్మది కూడా సేమ్ ఫిలాసఫీ. అందుకే అంతదూరం ప్రయాణించి మరీ విద్యార్థులకు మెడికల్ ఫిజిక్స్, రేడియాలజీ, అనస్థీషియా సబ్జెక్ట్‌లు బోధిస్తున్నారు. శాంతమ్మను చూసిన కొత్త వారెవరైనా తాను రోజూ యూనివర్సిటీకి బయలుదేరి వస్తుంటే.. ఆమె వయసు రీత్యా ఆసుపత్రికేమో అని అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత ఆ వయసులోనూ ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరు.

ప్రొఫెసర్ శాంతమ్మ విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే సాగింది. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అధ్యాపకురాలిగా చేరారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతమ్మ బోధన, పరిశోధన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే ఈ ప్రొఫెసర్ శాంతమ్మ రియల్లీ గ్రేట్‌..!

 

ట్రెండింగ్ వార్తలు