పండుగ పూట రైతులు పస్తు: రాజధాని గ్రామాల్లో నందమూరి బాలకృష్ణ

  • Publish Date - January 16, 2020 / 02:36 AM IST

సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిరసనలతో సాగుతున్నాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతిలో రైతులు, జేఏసీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో(16 జనవరి 2020) రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. పండుగ పూట మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు అక్కడి ప్రజలు. 

ఈ క్రమంలోనే మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు రైతులు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పర్యటించబోతున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొని రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అలాగే ఇవాళ రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతలు పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు గ్రామాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మరణించిన రైతు కుటుంబాలను సీపీఐ నేతలు పరామర్శించనున్నారు.

సంక్రాంతి పూట రాజధాని రైతులు పస్తు ఉంటున్నారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించుకున్నారు. మందడం, తుళ్లూరు వెలగపూడిలో నిరాహారదీక్షలు కూడా చేస్తున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో కూడా రైతుల నిరసనలు సాగనున్నాయి.