Andhra Pradesh Cabinet: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు సర్కారు గిఫ్ట్
80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్(Andhra Pradesh Cabinet), రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Andhra Pradesh Cabinet gives green signal to over 80 key proposals
- భారీగా పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం.
- ముప్పై ఐదు వేల ఉద్యోగాలు.
- రిటైర్మెంట్ వయస్సు రెండు సంవత్సరాల పెంపు.
Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 80కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్(Andhra Pradesh Cabinet), రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన, పునరుత్పాదక ఇంధన రంగాలకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం కీలక తీర్మానాలు చేసింది.
ఉపాధి కల్పన – అమరావతి అభివృద్ధి:
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫార్సు చేసిన దాదాపు రూ.34,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా 35,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో రూ.426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.139 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పర్యవేక్షణ కోసం సీఆర్డీఏలో 95 తాత్కాలిక పోస్టుల మంజూరుకు అంగీకరించారు. అలాగే అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో అక్కడ ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఉద్యోగులకు ఊరట – ఇంధన, పర్యాటక రంగాలు:
ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేలా విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో భారీ పర్యాటక ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధనమే లక్ష్యంగా అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు జరపడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని క్యాబినెట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
