Boss Scam: సైబర్ కేటుగాళ్లు రూటు మార్చారు.. కొత్తగా ‘బాస్ స్కామ్’ షురూ.. అసలు ‘బాస్ స్కామ్’ ఏంటో తెలుసా?
పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తూ ‘బాస్ స్కామ్’ (Boss scam) పేరిట సరికొత్త మోసాలకు తెరలేపారు.
What is boss scam and how hackers using ceo whatsapp accounts to steal money
- కంపెనీలను వణికిస్తున్న బాస్ స్కామ్.
- ఉన్నతాధికారుల పేరిట సైబర్ మోసాలు.
- ధృవీకరణతోనే సైబర్ ముప్పునకు చెక్.
Boss Scam: సాధారణంగా సైబర్ నేరగాళ్ల మోసాలు ఎలా ఉంటాయి.. లింకులు పంపించో, అకౌంట్స్ హాక్ చేసో వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేటుగాళ్లు రూట్ మార్చారు. పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తూ ‘బాస్ స్కామ్’ (Boss scam) పేరిట సరికొత్త మోసాలకు తెరలేపారు. ప్రస్తుతము ఈ తరహా మోసాలు ఎక్కువవుతున్నాయి. ఒక సంస్థలోని సీఈవో (CEO) లేదా ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటూ ఉద్యోగులను బురిడీ కొట్టించి, కంపెనీల అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
ఎలా మోసం చేస్తారంటే?
తొలుత ఆర్బీఐ వంటి ప్రభుత్వ సంస్థల పేరుతో కంపెనీ సీఈవోలకు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతారు. అందులో ఉండే ఒక జిప్ (Zip) ఫైల్‌ను ఓపెన్ చేయగానే మాల్వేర్ వారి సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది. దీని ద్వారా నేరగాళ్లు వాట్సప్ వెబ్ సెషన్లను హ్యాక్ చేసి, కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్లను తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ అధికారిక నంబర్ల నుంచే ఫైనాన్స్ టీమ్‌కు అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలంటూ మెసేజ్‌లు పంపి సొమ్ము దోచేస్తారు.
ముందస్తు జాగ్రత్తలు:
* నేరుగా ధృవీకరించుకోండి: పై అధికారుల నుంచి డబ్బులు పంపాలని లేదా అకౌంట్ వివరాలు మార్చాలని మెసేజ్ వస్తే, వెంటనే వారికి ఫోన్ చేసి లేదా స్వయంగా కలిసి కనుక్కోవాలి.
* అటాచ్మెంట్లతో జాగ్రత్త: తెలియని సోర్సెస్ నుంచి వచ్చే ఫైల్స్ లేదా అటాచ్మెంట్లను అస్సలు డౌన్లోడ్ చేయకూడదు. ఆర్బీఐ వంటి సంస్థలు వాట్సప్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్లు పంపవని గ్రహించాలి.
* డివైజ్ లింక్స్ తనిఖీ: వాట్సప్‌లో మీ ప్రమేయం లేకుండా ఏవైనా ఇతర డివైజెస్ (Linked Devices) కనెక్ట్ అయి ఉన్నాయేమో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. సిస్టమ్స్‌లో అప్డేట్ చేసిన యాంటీ-మాల్వేర్ టూల్స్ వాడటం సురక్షితం.
