అంతర్వేది రథం ప్రమాదవశాత్తు కాలిపోయిందా..? కావాలనే కాల్చేశారా..?

Antharvedi RADHAM :తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఈనెల 6న స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఊహించని ఘటనతో భక్తకోటి నివ్వెరపోయింది. హిందూ ధార్మిక సంఘాలైతే ఆగ్రహంతో రగిలిపోయాయి.
రథానికి మంటలు అంటుకోవడం, దగ్ధం కావడం అంతా నిమిషాల వ్యవధిలోనే. ఎలా జరిగింది? ఇదే ఇప్పుడు మిస్టరీ.
నవనరసింహాస్వాముల్లో అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఒకరు. వశిష్ట గోదావరి, బంగాళాఖాతం సంగమ ప్రాంతంలో పశ్చిమముఖంగా నిర్మించిన ఈ ఆలయాన్ని నిర్మించడంతో, దేశం నలుమూల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవడం, లేదంటే ఇంటి దగ్గర వివాహం చేసుకుని స్వామివారి సన్నిధిలో కళ్యాణవ్రతం చేసుకోవడం భక్తుల ఆనవాయితీ.
https://10tv.in/this-dynamic-ias-women-officer-has-a-village-named-in-her-honour-in-adilabad-dt/
రధసప్తమి రోజు నుంచి తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే స్వామి వారి కళ్యాణమహోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. రధ సప్తమినాడు లక్ష్మీ నరసింహా స్వామిని పెళ్ళికొడుకును చేయడం దగ్గర్నుంచి కళ్యాణం, రధోత్సవం, తెప్పోత్సవం, చక్ర స్నానాల వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
అంతర్వేది మాడవీధుల్లో స్వామివారి రధోత్సవం నభూతో నభవిష్యత్ అనేలా ప్రతీ ఏటా జరుగుతుంది. స్వామి వారి కళ్యాణోత్సవంలో అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న మొగల్తూరు రాజవంశీయులు పాల్గొంటారు. అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన ప్రముఖ నౌకావ్యాపార వేత్త శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ ఈ ఆలయాన్ని నిర్మించడంతో వారి వారసులు ఏటా ఈ రధోత్సవంలో పాల్గొంటారు. రధోత్సవం అనంతరం ఆ రధాన్ని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు.
దాదాపు 62 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ రథం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రథం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదవశాత్తు రథం తగలబడిందా.. ఎవరైనా కావాలనే ఇదంతా చేశారా అన్నది సస్పెన్.
ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, ఆరు నెలలుగా పనిచేయడం లేదు. ఘటనకు కారణాలు ఎంటన్నది తెలియకుండా పోయింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? భక్తులు పెట్టే నిప్పుల కుంపటి నుంచి అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయా..? మతి స్థిమితం లేని వ్యక్తి రథాన్ని తగలబెట్టారా..? ఇలా ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఇప్పటిదాకా రథం దగ్ధం ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.