వైసీపీ సర్కార్‌పై బీజేపీ కొత్త అస్త్రం.. ఈ ప్లాన్‌తో అయినా లక్ష్యం నెరవేరుతుందా?

ap bjp new sketch: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో కలసి రావడం లేదు. ఏపీలో అయితే పార్టీ పుంజుకోవడం కలగానే మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో చావు దెబ్బతిన్న ఆ పార్టీ.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని జనసేనతో కలసి ముందుకు సాగుతోంది. పోరాట స్ఫూర్తితో దూసుకుపోతోంది. మొన్నటి వరకూ వివిధ సమస్యలు, వివాదాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై చేసిన ఆందోళనలు సక్సెస్ కావడం పార్టీలో నూతనోత్సాహాన్ని నింపిందట. ఇదే దూకుడును కొనసాగించి ప్రజల్లోకి మరింత చేరువవ్వాలని భావిస్తోంది.
ప్రస్తుత పథకాలు కేంద్రానివేనని బీజేపీ వాదన:
ఒకవైపు సమస్యలపై స్పందిస్తూనే మరోవైపు కేంద్ర పథకాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ఎలా చెప్పుకుంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంటోందని అంటున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యనేతలతో వ్యూహరచన చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పథకాలు కేంద్రానివేనని బీజేపీ వాదిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రభావం కనిపించ లేదు. ఫలితంగా వైసీపీ, టీడీపీ దెబ్బకు 2019 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
2024 ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని లక్ష్యం:
2024 ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ నిర్ణయించుకుందని అంటున్నారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బయట పెట్టి, కేంద్ర మంత్రులను, అగ్రనేతలను ఏపీకి తీసుకొచ్చి బలోపేతం కావాలని స్కెచ్ వేసిందట. పార్టీలో నేతలను, జనసేనలో కార్యకర్తలను కలుపుకొని ఏపీలో తామేంటో నిరూపించుకొని ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని చూస్తోంది. తద్వారా ప్రజలకు చేరువ కావాలని వ్యూహరచన చేస్తోందని అంటున్నారు.
బీజేపీ స్కెచ్‌లపై భిన్నాభిప్రాయాలు:
మరోపక్క, బీజేపీ వేసిన స్కెచ్‌లపై భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రాష్ట్రంలో అమలవుతున్నవి కేంద్ర పథకాలేనని ఎన్నికల్లో చెప్పుకొచ్చినా ప్రజలు మాత్రం తిరస్కరించారు. ప్రస్తుతం అలా కాకుండా ఒక్కో శాఖ నుంచి ఆ శాఖ కేంద్ర మంత్రినే స్వయంగా ఏపీకి తెచ్చి వివరించేలా వ్యూహం రచించారట. అయితే మంత్రులను ప్రజల మధ్య తిప్పితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కొంతమంది బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కాకపోతే అలా చేయడం కరోనా దృష్ట్యా సాధ్యం కాదని మరి కొంతమంది వాదన. దీంతో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు.