దేవాలయాల పరిరక్షణకు బీజేపీ రథయాత్ర !

AP BJP rath yatra : ఏపీలో దేవాలయాల పరిరక్షణకు రథయాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. రామతీర్థం నుంచి రథయాత్ర చేపట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. ఆలయాలు, దేవతా విగ్రహాలపై దాడులను యాత్రలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకులను సైతం ఇందులో భాగస్వాములు చేయాలని యోచిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆలయాలపై దాడులు జరిగాయో…ఆ ప్రాంతాల్లో యాత్ర ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. 2021, జనవరి 17వ తేదీన వైజాగ్ లో జరిగే పార్టీ కోర్ కమిటీ భేటీలో రథయాత్రపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది బీజేపీ. ఈ సమావేశంలో యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణ చేపట్టాలని భావించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీ నుంచి సిట్ కు బదిలి చేసింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యంపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను రాష్ట్ర, జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో 20 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఈ కమిటీలో హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడేందుకు కమిటీలు పని చేయనున్నాయి.