దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ డిగ్రీ స్టూడెంట్ అదృశ్యం..’తమ్ముడికి కొడుకుగా పుడతా’నంటూ లెటర్

AP : Chittor District Degree Student missing : ఏపీలోని చిత్తూరు జిల్లాలో వరుస ఘటనలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మదనపల్లెలో అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్ల హత్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూఢ విశ్వాసాలు రెండు నిండు ప్రాణాలను బలిదీసుకున్నాయి. ఈ ఘటన మరువకముందే ఓ యువకుడి అదృశ్యమైన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది.
గంగవరం మండలం మార్చేపల్లి గ్రామానికి చెందిన గణేశ్ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈక్రమంలో జనవరి 21 నుంచి కనిపించకుండాపోయాడు. వెళుతూ వెళుతూ..‘ తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ’ లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఇంటినుంచి వెళ్లిన కొడుకు ఎంతకూ తిరిగిరావటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇల్లు వెతగ్గా కొడుకు రాసి లెటర్ కనిపించింది.
అది చదివిన వారి గుండెలు అదిరిపోయాడు. భయపడిపోయారు. ఆ లేఖలో ‘‘నేను దేవుడు దగ్గరకు వెళ్లిపోతున్నాను. నేను కనిపించట్లేదని మీరు భయపడవద్దు..బాధపడొద్దు. నేను తిరిగి తమ్ముడికి కొడుకుగా పుడతాను’ అని రాసాడు. దీంతో మదనపల్లె ఘటనలాగా తమ కొడుకు ఏమైపోతాడోనని తల్లిడిల్లిపోతున్న గణేశ్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా..గణేశ్ కు భక్తి భావాలు ఎక్కువని బంధువులు, స్థానికులు చెబుతున్నారు. మదనపల్లె ఘటనను దృష్టిలో ఉంచుకుని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.