Ap Rain
heavy rains : ఏపీలో వర్షాకాలం భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తు అప్రమత్తం అయింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు.
జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించించారు. మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు కింద పేర్కొన్నారు.
• 1070
• 18004250101
• 08632377118
Rains In Andhra Pradesh : ఏపీలోనూ దంచికొడుతున్న వర్షాలు
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తా ఆంధ్రలో ముసురు వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.