Kunja Rajita : అంతర్జాతీయ వేదికపై ఆదివాసీ ఆడబిడ్డ..నైరోబి అథ్లెటిక్స్‌కు ఎంపిక

అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాాసీల ఆడబిడ్డ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. కుగ్రామంలో పుట్టిన కుంజా రజిత పట్టుదలతో కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. లక్ష్యంవైపు పరుగులు పెడుతోంది..

Kunja Rajita : అంతర్జాతీయ వేదికపై ఆదివాసీ ఆడబిడ్డ..నైరోబి అథ్లెటిక్స్‌కు ఎంపిక

Kunja Rajitha Selected For Nairobi Athletics (1)

Updated On : August 12, 2021 / 5:36 PM IST

Tribal Girl Kunja Rajitha Selected For Nairobi Athletics : పచ్చని కొండ కోనల్లో అమాయకంగా జీవించే ఆదివాసీల బిడ్డ ఘతన సాధించింది. కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన అడవిబిడ్డ లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది. అత్యంత కుగ్రామంలో పూసిన అడవిపువ్వు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది.పరగుల పందెంలో గెలవాలని..కన్నవారికి పెంచిన ఊరికి ఘనత తేవాలని ఆశపడుతోంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో పరుగులో రాణించేందుకు తన పాదాలను పరుగులుపెట్టిస్తోంది ఓ ఆదివాసీ బాలిక. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనటానికి అర్హత సాధించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది కుగ్రామానికి చెందిన కుంజా రజిత. ఆదివాసీల బిడ్డ.

కుగ్రామం నుంచి..అంతర్జాతీయ స్థాయికి ఆదివాసీ ఆడబిడ్డ
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురం. చుట్టూ దట్టమైన అడవి తప్ప ఇంకేమీ కనిపించని గ్రామం. 35 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడికి వలసవచ్చింది అక్కడికి కుంజా మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. కుంజా మారయ్య-భద్రమ్మలకు మొత్తం ఐదుగురు పిల్లలు. వారిలో ముగ్గురు మగ పిల్లలు ..ఇద్దరు ఆడపిల్లలు.వారిలో ఆఖరి బిడ్డ రజిత. భర్త మారయ్య చనిపోవటంతో భద్రమ్మే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది.పిల్లల కడుపులు నింపటానికి ఎన్నో కష్టాలు పడింది.అడవితల్లిని నమ్ముకుని జీవించే ఆదివాసీల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం వాటిని సమీపంలోని గ్రామంలో అమ్ముకోవటం ఆ వచ్చినదాంతోనే జీవించటం.

అటువంటి పరిస్థితుల్లో కూడా రజిత ప్రతీరోజూ కాలినడకన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి చదువుకునేది. సెలవులుంటే తల్లికి సహాయంగా తల్లి కూడా అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చిసహాయంగా ఉండేది. అడవిలోకి ఇలా వెళితే అలా కట్టెల మోపుతో తిరిగి వచ్చేసేది రజిత తల్లికంటే ముందు. పరుగులో రజితది చిరుత వేగం. ఆ వేగాన్ని రజిత పెద్ద అన్నయ్య జోగయ్య గమనించాడు. చిన్నా చితకా పరుగుపందెం పోటీల్లో చెల్లెలిని పాల్గొనేలా చేసేవాడు. పోటీల్లో రజిత ఫస్టు వచ్చేది.

ఆగని పరుగుతో అంతర్జాతీయ స్థాయికి ఎంపిక..
కాటుకపల్లిలో 8 వరకూ చదువుకున్న రజిత ఆ తరువాత నెల్లూరు ఆశ్రమ స్కూల్లో సీటు రావడంతో 9, 10 అక్కడే పూర్తిచేసింది. ఓ పక్క చదువుకుంటునే మరోపక్క నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్‌ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్‌ లో చేరి రన్నింగ్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తరువాత మంగళగిరిలో ఇంటర్మీడియెట్‌ లో జాయిన్ అయ్యింది. అక్కడ చదువుకుంటూనే గుంటూరులో శాప్‌ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్‌ వద్ద అథ్లెటిక్స్‌ ట్రైనింగ్ పొందింది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్‌ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో రజిత మెరిసింది. చక్కటి ప్రతిభతో అందరిని ఆకట్టుకుంది. అలా ఆమెపై నమ్మకంతో కొన్ని టెస్టులు పెట్టగా వాటిలో కూడా రజిత ముందుంది. దీంతో ఆగస్టు 17న కెన్యాలోని నైరోబిలో జరిగే అండర్‌–20 జూనియర్‌ అథ్లెటిక్‌ పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్బంగా రజిత తనపై తనకు నమ్మకముందని..తనకు సరైన ప్రోత్సాహముంటే దేశం కోసం పరుగుపెడతానని దేశానికి పేరుప్రతిష్టలు తీసుకొస్తానని చెబుతోంది అంతులేని ఆత్మవిశ్వాసంతో ఈ ఆదివాసీ ఆడబిడ్డ కుంజా రజిత.