AP Elections 2024 ( Image Credit : Google )
AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రామకృష్ణ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
మరోవైపు.. జిల్లాలోని సల్మాన్ పురం, పంచేడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారని నేతలు వాగ్వాదానికి దిగారు. తమకు ఓటు వేయాలని పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఇరువర్గాల నేతలు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయగా, పలు జిల్లాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలింగ్ కాస్తా మందకొడిగా సాగుతోంది. ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒక గంటకు 40.26 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు సైతం మొరాయించడంతో ఓటర్లు భారీగా క్యూలైన్లలో నిలిచిఉన్నారు.
Read Also : CM Revanth Reddy: కొడంగల్‌లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి