AP Employees Holiday : తమిళనాడు ఎన్నికల రోజు.. APలో వీళ్లకు సెలవు..
AP Employees Holiday : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 న రెండు జిల్లాల ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.
ap govt declare special holiday on april 23 to chittoor tirupati employees for Tamil Nadu elections
AP Employees Holiday : కొన్ని రోజుల క్రితం భారత ఎన్నికల సంఘం తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 9న కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక ఏప్రిల్ 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల వారికి సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో పనిచేసే అర్హులైన ఓటర్లైన ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజైన ఏప్రిల్ 23, 2026న, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తమిళనాడు ఓటర్లకు, రోజువారీ వేతన కార్మికులతో సహా అందరికీ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 – సెక్షన్ 135B ప్రకారం.. ఏపీలో ఉన్న తమిళనాడు ఓటర్లు తమ రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నిబంధనను ఉల్లంఘించి, ఓటు వేయడానికి సెలవు ఇవ్వని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని, తమిళనాడులో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులు, కార్మికులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.
