జన రణ భేరి : అమరావతి రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి

జన రణ భేరి : అమరావతి రైతులు ఉద్యమానికి ఏడాది పూర్తి

Updated On : December 17, 2020 / 11:46 AM IST

AP Jana Rana Bheri : అమరావతి రైతులు ఉద్యమం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది అమరావతి జేసీ. ఈ సభ వేదికగా రైతులు భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అమరావతి రైతు ఉద్యమానికి ఏడాది పూర్తి అయ్యింది. సరిగ్గా ఇదే రోజున ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు.

జగన్‌ నిర్ణయంపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో సీఎం నిర్ణయం అగ్గిరాజేసింది. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో రాజధాని రైతులు నిరసనలకు దిగారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర చోట్ల పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు.

రోడ్లపై బైఠాయింపులు, రాస్తారోకోలు, నాయకుల ఘెరావ్‌, ముట్టడులతో హోరెత్తించారు. అంతేకాదు.. ఏకంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రైతులు చేపట్టిన సెక్రటేరియట్‌, అసెంబ్లీ ముట్టడి నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసుల లాఠీచార్జీలో చాలామంది రైతులకు గాయాలు అయ్యాయి. అంతేకాదు… పోలీసులకు గాయాలు అవ్వడంతో.. రైతులపై కేసులు పెట్టే వరకు పరిస్థితి వెళ్లింది.

అమరావతిలో ప్రారంభమైన ఆందోళనలు గుంటూరు, విజయవాడకు పాకాయి. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కమిటీ నివేదికల సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు రోడ్లపై నిరసనలకు దిగారు. రైతుల ఆందోళనలకు ప్రధానప్రతిపక్షం టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీ సంఘీభావం తెలిపాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశాయి.

ఏడాది కిందట మొదలైన ఉద్యమం నేటికి కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం ఉధృతమవుతోంది. నిరసన తీవ్రతను సర్కారుకు తెలియజేసేందుకు అన్నదాతలు రోజూ పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.

రాయపూడిలో భారీ బహిరంగ సభ
అమరావతి రైతు ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుని ఇవాళ భారీ బహిరంగ నిర్వహిస్తున్నారు. రాయపూడిలో జనభేరి పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు రాజధాని కోసం భూములిచ్చిన రైతులంతా హాజరుకానున్నారు. దాదాపు 30వేల మందికిపైగా ఈ సభలో పాల్గొంటారని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఈ సభా వేదికగా భవిష్యత్‌ కార్యాచరణపై కీలక ప్రకటన చేయాలని జేఏసీ భావిస్తోంది.

ఒకే వేదికపై  టీడీపీ, బీజేపీ నేతలు :
టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర నేతలు ఇవాళ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. జనభేరి సభకు ఇరుపార్టీల నాయకులు ఇవాళ హాజరవుతున్నారు. రెండు పార్టీల నేతలు ఈ సభలో పాల్గొని రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ, బీజేపీ నేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీలు ఎలా వ్యవహరించబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

2019 ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ మధ్యనున్న పొత్తు చెడింది. దీంతో అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది. రెండు పార్టీలు శత్రువుల్లా కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ప్రధాని మోదీపై ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు… రాజధానికి నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య మరింత దూరం పెరిగింది.

ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన చంద్రబాబు…. బీజేపీకి మళ్లీ దగ్గర కావాలని ప్రయత్నాలు చేసినా… అది సాధ్యం కాలేదు. అయితే ఈ మధ్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతికి అనుకూల ప్రకటన చేశారు. అవసరమైతే అమరావతి ఏకైక రాజధాని కోసం పోరాటం చేస్తామని కూడా ప్రకటించారు.

దీంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. బీజేపీ వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా స్పందించారు. అమరావతికి బీజేపీ సైతం సపోర్ట్‌ చేస్తోందని.. ఇంకా ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు అమరావతి రాజధానిని అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇవాళ జరిగే జేఏసీ జనభేరి సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. టీడీపీ, బీజేపీతోపాటు.. జనసేన, సీపీఐ, సీపీఎం నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు.

జేఏసీ సభకు పటిష్ట బందోబస్తు :
రాయపూడిలో అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న సభకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. సభలో పాల్గొనే నేతలెవరూ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పోలీసులు సూచించారు.

తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. రాయపూడిలో ఏడాది ఉద్యమ సభకు షరతులతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉందని, అదే జరిగితే నిర్వాహకులదే బాధ్యతని డీఐజీ చెప్పారు.