LEAP School : విద్యార్థులకు శుభవార్త.. ఈ స్కూల్లో సీటోస్తే.. చదువు, భోజనం ఉచితం.. ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే
LEAP School : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యాను అందించే దిశగా సర్కార్ ముందడుగు వేసింది. అందులో భాగమే ఈ లీప్ స్కూల్.. ఆ వివరాలు..
ap leap school in mangalagiri full details here
LEAP School : పేద, సామాన్య విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వారికి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఏపీ, మంగళగిరిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి లీప్ (LEAP) మోడల్ స్కూల్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో.. మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు గ్రామంలో దీన్ని ప్రారంభించారు. దాదాపు రూ.16 కోట్ల భారీ వ్యయంతో ఈ అత్యాధునిక ప్రభుత్వ విద్యా కేంద్రాన్ని నిర్మించారు.
పాత బడి.. కొత్త రూపు
లీప్ స్కూల్ కోసం పాత బడినే సరికొత్తగా మార్చారు. 1983లో నిర్మించిన పాత జెడ్పీ ఉన్నత పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి.. కార్పొరేట్ శైలిలో పునర్నిర్మించారు. 5.2 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఉన్న ఈ స్కూల్లో తరగతి గదుల సంఖ్యను 12 నుంచి 25కి పెంచారు. ప్రతి గదిని స్మార్ట్ డిజిటల్ బోధనకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ ఎల్కేజీ (LKG) నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు.
ఈ లీప్ స్కూల్ ప్రత్యేకతలు
- మొదటిసారి యాంఫీ థియేటర్: రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం కోసం ఒక ‘యాంఫీ థియేటర్’ను ఏర్పాటు చేశారు.
- క్రీడా ప్రాంగణాలు: ఈ స్కూల్లో చదివే విద్యార్థుల కోసం అధునాతన ఇండోర్ స్టేడియం, విశాలమైన ఫుట్‌బాల్ గ్రౌండ్, చిన్నారుల కోసం ప్లే ఏరియాలను సిద్ధం చేశారు.
- భారీ డైనింగ్ హాల్: ఈ స్కూల్లో ఒకేసారి 400 మంది విద్యార్థులు కూర్చుని భోజనం చేసేలా అత్యాధునిక.. భారీ డైనింగ్ హాల్‌ను నిర్మించారు.
- అంతర్జాతీయ స్థాయి ల్యాబ్‌లు: సైన్స్ మరియు టెక్నాలజీపై పట్టు సాధించేందుకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, కంప్యూటర్, వొకేషనల్ మరియు ఇన్నోవేషన్ హబ్‌తో కూడిన 6 అత్యాధునిక ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు.
అడ్మిషన్ల కోసం బారులు
ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడంతో తమ పిల్లలను ఈ బడిలో చేర్పించేందుకు.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం క్యూ కడుతున్నారు. గతంలో ఇక్కడ 510 మంది విద్యార్థులు ఉండగా, ఈ విద్యాసంవత్సరం ఆ సంఖ్య ఏకంగా 1,100కి చేరింది. ఈ బడిలో పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగానే కార్పొరేట్ స్థాయి విద్య అందుతోంది.
ప్రతి నియోజకవర్గంలో లీప్ స్కూళ్లు:
లీప్ స్కూల్ కి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో ఉన్న చిన్నచూపును తొలగించి.. ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడమే ‘లీప్’ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
