తన వెనుక గోతులు తవ్వుతున్న పార్టీలోని వ్యక్తులకు చెక్ పెట్టేందుకు మంత్రి అనిల్ వ్యూహం

ap minister anil kumar yadav: దశాబ్దం క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ దూకుడు చూపిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం లేకపోయినా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అప్పట్లో నమ్ముకొని వచ్చిన నాయకులు హ్యాండిచ్చేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచిన అనిల్.. పార్టీ అధినేతకు విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏ పని అప్పగించినా కమిట్‌మెంట్‌తో పని చేస్తారన్న పేరుపొందారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పడం ద్వారా అధిష్టానం దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.
పెద్ద రెడ్లకు చెక్ పెట్టేందుకు:
రాష్ట్ర మంత్రి అయినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ దృష్టంతా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు సిటీ నియోజకవర్గ అభివృద్ధిపైనే పెడుతున్నారట. దీని వెనుక చాలా కారణాలున్నాయని అంటున్నారు. తన వెనుక గోతులు తవ్వుతున్న పార్టీలోని పెద్దారెడ్లను ఢీ కొట్టడంపై ఓ కన్నేసి ఉంచారని చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లు అనిల్ దూకుడు పెంచేశారట. అభివృద్ధితో నియోజకవర్గ ప్రజలకు దగ్గరవడంతో పాటు తనకు చెక్ పెట్టాలనుకుంటున్న పెద్దారెడ్లకు సరైన జవాబు ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అనుచరులు అంటున్నారు. అందుకే తన నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జోరుగా కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.
రూ.50 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు:
వారంలో ఐదు రోజులు రాజధాని అమరావతిలో బిజీగా గడిపినా మిగిలిన రెండు రోజులు మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు అనిల్. నియోజకవర్గ సమస్యలపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్షలు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయిస్తున్నారు. వివిధ సమస్యలను ఇప్పటికే పరిష్కరించారు. నగరంలో అన్ని కూడళ్లను కలిపే ప్రధాన మార్గమైన మినీ బైపాస్ పై దృష్టి పెట్టారు మంత్రి అనిల్.
నగరం మీదుగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు వ్యాపార సముదాయాలు, విద్యాలయాలకు వెళ్లాలంటే ఎక్కువ శాతం మంది ఈ మార్గాన్నే వినియోగిస్తారు. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యే. దీని పరిష్కారానికి రూ.50 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
నెల్లూరు సిటీలో వేరే సామాజికవర్గాల వ్యక్తులు గెలవడం ఈజీ కాదు:
నెల్లూరు సిటీ అంటే రెడ్డి సామాజికవర్గానిక అడ్డా. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కువసార్లు ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే గెలుపొందారు. వేరే సామాజికవర్గాల వ్యక్తులు నెల్లూరు సిటీలో గెలవడం అంటే ఆషామాషీ కాదనే అభిప్రాయం ఉంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ ఓటర్లున్నది నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే. ఇక్కడ గెలవాలంటే ముస్లిం, బలిజ కులస్తుల ఓట్లు ముఖ్యం.
బాలాజీ నగర్, ఎన్టీఆర్ నగర్, ఆదిత్యనగర్ లాంటి మిడిల్ క్లాస్ ఓట్లతో పాటు పొర్లుకట్ట, కపాడిపాలెం, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం ఏరియాల్లోని మాస్ ఓట్లు చాలా కీలకం. వీరంతా కొన్నేళ్లుగా రెడ్లకు జై కొడుతూ వస్తున్నారు. 2014, 2019 లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఇమేజ్‌కు తోడు అనిల్ యాదవ్‌పై ఉన్న సానుభూతి కారణంగా ఆయన గెలిచారు.
అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కావడాన్ని ముందు నుంచీ నెల్లూరులోని పెద్ద రెడ్లు, బడా పొలిటికల్ ఫ్యామిలీలు జీర్ణించుకోలేకపోతున్నాయట. అధినేత జగన్ దగ్గర అనిల్‌కు మంచి పట్టు ఉండడంతో దానిని పోగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్. కాకపోతే ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉన్న మంత్రి అనిల్ వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వస్తున్నారని చెబుతున్నారు. తన చుట్టూ ఉన్న కనిపించని శత్రువులకు అభివృద్ధి మంత్రంతోనే సమాధానం చెప్పాలని అనిల్ డిసైడ్ అవ్వడమే కాదు.. ఆచరించి చూపిస్తున్నారట.