ఏపీ రాజకీయాల్లో ట్విస్టులు.. మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు!

ఏపీ రాజకీయాలు రకరకాల ట్విస్ట్‌లు తీసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వారి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా మెగా బ్రదర్స్ మధ్య ఏపీ రాజకీయాలు తలనొప్పులుగా పరిణమించాయని అంటున్నారు. ఒకపక్క పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ఏపీ సీఎం జగన్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మరోపక్క తమ్ముడు జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం జగన్‌పై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు.
ఏ విషయాన్ని విడిచిపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. చిరంజీవి మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాలను ఇటీవల కాలం ఎడతెరిపి లేకుండా సమర్థిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు జనాలు.
ఇదే జగన్ ప్లాన్ :
జగన్ సీఎం అయ్యాక.. సినీ పరిశ్రమకు చెందిన ఒక వర్గం ఆయన దగ్గరకు వెళ్లలేదు. ఈ విషయంలో జగన్ కొంత ఉక్రోషంగా ఉన్నారంటున్నారు. సీఎం అయ్యాక కనీస మర్యాదగా కలవకపోతే ఎలా అనే వారు కూడా ఉన్నారు. కానీ, ప్రముఖులెవరు ఆయనను కనీసం అభినందించలేదంట. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ పెద్దలు జగన్‌ను పెద్దగా పట్టించుకోలేదంటున్నారు.
సినీ పరిశ్రమలో బయటకు అందరూ కలిసి ఉన్నట్టే కనిపిస్తారు. కానీ లోలోపల ఎక్కడో చిన్న స్పర్థలున్న విషయం అనేక మార్లు బయటపడింది. ఈ విషయంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న వారందరికీ తెలుసు. సరిగ్గా దీనినే ఉపయోగించుకోవాలని జగన్ ప్లాన్ వేసుకున్నారట.
ఏపీ రాష్ట్ర విభజన తర్వాత సినీ పరిశ్రమ విశాఖపట్టణానికి తరలే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావించారు. కానీ, అలాంటిదేమీ జరగకపోగా.. సీఎం జగన్‌ను అభినందించేందుకు కూడా సినీ పరిశ్రమలో మెజారిటీ వర్గం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి నరుక్కుంటూ రావాలని జగన్ భావిస్తున్నారట.
అందులో భాగంగానే చిరంజీవిని పావులా వాడుకుంటున్నారని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్ కల్యాణ్ ఒకపక్క జగన్‌ను టార్గెట్ చేస్తూ ప్రతి అంశాన్నీ వేలెత్తి చూపిస్తున్నారు. ఇది కాస్త జగన్ ప్రభుత్వానికి తలనొప్పిలా తయారైంది. అదే సమయంలో సినీ పరిశ్రమ వైజాగ్ తరలితే రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఆకర్షణ కూడా పెరుగుతుందని అనుకుంటున్నారు. కానీ, అలాంటి సంకేతాలేవీ ఇప్పటి వరకూ కనిపించడం లేదు.
జగన్‌తో చిరు మీట్.. కారణం ? :
తొలిసారి సైరా సినిమాను చూడాలని కోరేందుకు విజయవాడలోని జగన్ ఇంటికెళ్లి సతీసమేతంగా కలిశారు చిరంజీవి. ఫ్యామిలీ వాతావరణంలో సరదాసరదాగా సాగిపోయింది ఆ మీట్.. నిజానికి జగన్ సైరా సినిమా చూడలేదు కూడా. దాని వెనుక కూడా చిరంజీవి ద్వారా సినీ పరిశ్రమలో ఒక వర్గం విశాఖకు తరలించే అంశాలపై వారి మధ్య చర్చకు వచ్చిందనే వాదనలున్నాయి.
ఇప్పుడు తాజాగా దిశ చట్టం విషయంలోనూ, అలాగే మూడు రాజధానుల అంశంలోనూ జగన్ నిర్ణయాలను సమర్థించారు చిరంజీవి. అది సాదాసీదాగా కాదు.. ఆహా అద్భుతమైన నిర్ణయం.. దీంతో మహాద్భుతాలు జరిగిపోతాయన్నంతలా చిరంజీవి పొగిడేశారు. దీనంతటి వెనుక జగన్ ప్లాన్ ఉందంటున్నారు. చిత్ర పరిశ్రమలోని వర్గాలను వాడుకొని విశాఖ మీద దృష్టిపెట్టేలా చేయాలన్న ఆలోచన ఉందని చెబుతున్నారు.
అదే బాటలో చిరంజీవి :
విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక ఇది కూడా ఒక కారణమేనని అంటున్నారు. పర్యాటన అందాలతో అలరారే విశాఖను రాజధానిగా కూడా చేస్తే సినీ పరిశ్రమ ఆటోమేటిగ్గా తరలి వస్తుందని అంచనా వేస్తున్నారట. విశాఖ తీరంలో ఇప్పటికే రామానాయుడు స్టూడియో పనులు జరుగుతున్నాయి. మరికొందరు సినీ పెద్దలకు స్థలాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయంటున్నారు.
చిరంజీవి కూడా అదే బాటలో నడవబోతున్నారట. అందుకే చిరంజీవి తనదైన శైలిలో జగన్‌ను సమర్థిస్తుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయంగా విభేదిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడడంతో మెగాభిమానులు తలపట్టుకుంటున్నారట.