Electric Bus Routes: ఏపీ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచే ఆ సర్వీసులు షురూ
విశాఖపట్నం, భోగాపురం విమానాశ్రయ ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Electric Bus Routes) సరికొత్త రవాణా సౌకర్యాన్ని తీసుకురానుంది.
APSRTC has finalized electric bus routes from Vizag to Bhogapuram Airport
- భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈవీ బస్సులు
- ఆగస్టు ఒకటి నుండి సర్వీసులు
- రెండు ప్రధాన రూట్లలో ప్రయాణం
Electric Bus Routes: విశాఖపట్నం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) సరికొత్త రవాణా సౌకర్యాన్ని తీసుకురానుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు పర్యావరణహిత ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సుల రూట్ల(Electric Bus Routes)ను అధికారులు ఖరారు చేశారు. రానున్న ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ అత్యాధునిక ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
రెండు ప్రధాన రూట్లలో 20 ఎలక్ట్రిక్ బస్సులు:
ఈ విమానాశ్రయ సర్వీసుల కోసం మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 7 బస్సులు విశాఖకు చేరుకోగా, మిగిలిన 13 బస్సులు ఈ నెలాఖరుకు రానున్నాయి. ఈ బస్సులను రెండు ప్రధాన రూట్లలో నడుపుతారు. మొదటి రూట్లో 10 బస్సులు గాజువాక నుండి ఎన్.ఏ.డి జంక్షన్ మీదుగా, రెండో రూట్లో మిగిలిన 10 బస్సులు సింధియా నుండి రైల్వే స్టేషన్, రుషికొండ బీచ్ రోడ్ మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకుంటాయి.
లగేజీ వసతులు, ఆధునిక ఫీచర్లతో ప్రయాణం:
విమానాల రాకపోకల సమయాలకు అనుగుణంగా నడిచే ఈ బస్సుల వల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్, బీచ్ రోడ్ ప్రయాణికులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. లగేజీ పెట్టుకోవడానికి ప్రత్యేక వసతులు, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో కాలుష్య రహిత ప్రయాణ అనుభూతిని ఇవి అందించనున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో, ప్రభుత్వ ముందస్తు కనెక్టివిటీ ప్లాన్ విశాఖ ప్రజా రవాణాలో కొత్త విప్లవానికి నాంది పలకనుంది.
