ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-2గా అచ్చెన్నాయుడు.. ఖైదీ నంబర్ 1573

  • Published By: vamsi ,Published On : June 14, 2020 / 02:27 AM IST
ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-2గా అచ్చెన్నాయుడు.. ఖైదీ నంబర్ 1573

Updated On : June 14, 2020 / 2:27 AM IST

టీడీపీ ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

అక్కడి నుంచి కారులో గుంటూరుకు తీసుకొని రాగా.. సుదీర్ఘ ప్రయాణంలో అచ్చెన్నాయుడి గాయం పచ్చిగా మారింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడిని అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అంతకుముందు ఆయనను రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, ఖైదీ నంబర్ 1573ని జైలు అధికారులు ఆయనకు కేటాయించారు.

ఈ కేసులో ఏ-1గా రమేశ్ కుమార్‌ను చేర్చిన పోలీసులు ఏ-2గా అచ్చెన్నాయుడిని, ఏ-3గా ప్రమోద్ రెడ్డి పేర్లను చేర్చారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లోని పొదిలి ప్రసాద్ బ్లాక్‌లో ఉన్న తొలి అంతస్తులో వైద్య చికిత్స అందిస్తున్నారు.