West Godavari District : శ్రీరామనవమి వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం.. మేకుల కర్రలు, చాకుతో దాడి
West Godavari District : శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసైనికులపై హత్యాయత్నం జరిగింది.
Raghu Rama Krishna Raju
- పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో ఉద్రిక్తత
- డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కారును అడ్డగింత
- జనసైనికులపై మేకుల కర్రలు, చాకులతో దాడి
West Godavari District : శ్రీరామనవమి వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసైనికులపై హత్యాయత్నం జరిగింది. మేకుల కర్రలతో కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నేత అనిల్ తలకు మేకులు దిగాయి. మరో జనసైనికుడిపై చాకుతో దాడి చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణం పెదపేటలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. అయితే, ఇక్కడి రామాలయంలో కేవలం నందీశ్వరునికి మాత్రమే పూజించాలని, రాముడికి దండ వెయ్యొద్దని స్థానిక దళితులు సూచించారు. రఘురామకృష్ణం రాజు కారుకు అడ్డంపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఉద్రిక్తతల నడుమ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు రామాలయాన్ని దర్శించి, శ్రీరాముడికి దండ అర్పించి అక్కడ నుంచి మరొక రామాలయానికి వెలుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్‌ను అనుసరిస్తున్న జన సైనికులపై ఒక్కసారిగా ఆందోళన కారులు మేకుల కర్రలతో, చాకులతో దాడికి పాల్పడ్డారు.
జనసేన నేత అనిల్‌కు తలలో మేకులు దిగబడగా, ఆ దాడిని ఆపడానికి వెళ్ళిన మరొక జన సైనికుడుపై కొందరు చాకుతో వీపుపై పొడిచారు. ఇరువురు జనసైనికులకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటీన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో ఖండించారు.
