Avanthi Srinivas: భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవా.. సీటు మారుస్తారా?

భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

Avanthi Srinivas: భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవా.. సీటు మారుస్తారా?

Avanthi Srinivasa Rao

Avanthi Srinivasa Rao: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే (Bhimili MLA) అవంతి శ్రీనివాస్‌కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోందా? 2009లో ప్రజారాజ్యం.. 2019లో వైసీపీ తరఫున గెలిచిన అవంతికి 2024లో పరిస్థితులు అనుకూలంగా లేవా..? 2014లో అనకాపల్లి (Anakapalle) ఎంపీగా పోటీ చేసిన మాజీ మంత్రి మళ్లీ అక్కడికే మారిపోతారా? ఇలాంటి ప్రశ్నలు అన్నింటికి ఒక్కటే సమాధానం.. అవంతి పోటీ చేస్తే కష్టమే అంటూ సొంత పార్టీ నేతలే తేల్చేస్తున్నారు. మంత్రిగా మూడేళ్లు పనిచేసిన విద్యాసంస్థల అధినేతకు ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడానికి కారణమేంటి? భీమిలిలో తెరవెనుక (Tera Venuka) రాజకీయం ఎలా ఉంది.

వైసీపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. పరిపాలన రాజధానిగా విశాఖను చేసి తన అడ్డాగా మార్చుకోవాలని అనుకుంటున్న వైసీపీకి ఇక్కడి రాజకీయాలు అంతుచిక్కడం లేదు. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ ఆధిపత్యం చెలాయించగా.. పక్కనే ఉన్న భీమిలి, గాజువాకల్లో వైసీపీ విజయదుందుబి మోగించింది. ఐతే ఈ సారి భీమిలిలో ఆ జోరు బాగా తగ్గినట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఖరితో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే అవకాశం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన అవంతి అనూహ్య విజయం సాధించారు. అంతేకాదు జగన్ క్యాబినెట్లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి విశాఖ నగరంలో కీలక నేతగా మారారు. కానీ, సొంత నియోజకవర్గంలో రాజకీయాన్ని చక్కదిద్దుకోలేక చేతులెత్తేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Also Read: శ్రీకాకుళంలో టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ సూపర్ ప్లాన్!

రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా పనిచేసిన అవంతి.. వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా నడిచినా.. భీమిలిలో టీడీపీ మెజార్టీ సాధించడం అవంతి వైఫల్యమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గ్రేటర్ విశాఖలో భాగమైన భీమిలిలో కార్పొరేషన్ ఎన్నికలతోపాటు.. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి కనీస బాధ్యత తీసుకోలేదని.. ఇప్పటికీ ఆ వైఫల్యాలను అధిగమించే కృషి చేయడం లేదని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. మళ్లీ అవంతికే సీట్ ఇస్తే ఓటమి తప్పదని అధిష్టానానికి హెచ్చరిస్తున్నారు.

Also Read: పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా!

విద్యాసంస్థల అధినేతగా ఈ ప్రాంతానికి సుపరిచుతుడైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు(Muttamsetti Srinivasa Rao) అలియాస్ అవంతి శ్రీనివాస్.. బలమైన కాపు సామాజిక వర్గ నేత. 2009లో ప్రజారాజ్యం నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2014లో టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీని వదిలేసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. స్థానికేతరుడైన అవంతి విశాఖ జిల్లావ్యాప్తంగా సుపరిచుతుడే.. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనను సీటు మార్చి అనకాపల్లి ఎంపీగా పంపనున్నారని వైసీపీ వర్గాల సమాచారం. ఐతే.. అవంతిని భీమిలి నుంచి తప్పిస్తే.. ఇక్కడి నుంచి ఎవరిని పోటీకి నిలుపుతారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. కానీ, అవంతిని మార్చితేనే గెలుపు అన్న నినాదమే భీమిలిలో హాట్‌ టాపిక్‌గా మారింది.