Tiger Fear : టైగర్ టెన్షన్.. రాత్రి వేళ ఒంటరిగా తిరగొద్దని సిక్కోలు వాసులకు హెచ్చరిక..

పులి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tiger Fear : టైగర్ టెన్షన్.. రాత్రి వేళ ఒంటరిగా తిరగొద్దని సిక్కోలు వాసులకు హెచ్చరిక..

Updated On : November 29, 2024 / 8:19 PM IST

Tiger Fear : శ్రీకాకుళం జిల్లా సిక్కోలు వాసులను బెంగాల్ టైగర్ బెంబేలెత్తిస్తోంది. రెండు రోజులుగా సిక్కోలు పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కోట బొమ్మాళి, సంత బొమ్మాళి మండలాల్లో పులి తిరుగుతోంది. పొడుగుపాడు సమీపంలో రోడ్డు దాటుతూ ఉండగా స్థానికులు పులిని గమనించారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరించారు.

సిక్కోలు వాసులను పులి భయం వెంటాడుతోంది. గత వారం రోజుల పాటు ఒడిశాలో తిరిగిన బెంగాల్ టైగర్.. శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అయ్యింది. 20 నుంచి 30 కిలోమీటర్లు నడుస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తోంది. పలాస డివిజన్ పూర్తిగా దాటుకుని టెక్కలి డివిజన్ లో కి ప్రవేశించింది. పులి సంచారం గురించి తెలియండంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

నిన్న మూలపేట ప్రాంతంలో ఆవును చంపిన పులి.. ఇవాళ సంతబొమ్మాళి మండలం నుంచి కోటబొమ్మాళి మండలంలోకి వచ్చింది. జాతీయ రహదారిని దాటుతుండగా కొంతమంది పెద్ద పులిని చూశారు. వెంటనే పెద్ద పులి సంచారం గురించి అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం విషయం తెలిసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువులు టార్గెట్ గా పెద్ద పులి ముందుకు వెళ్తోంది. ఆవులను చంపుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం పూట ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పటికే ఉద్దానం ప్రాంతంలో సాయంత్రం పూట ఎలుగుబంట్లు దాడి చేసిన పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పులి కూడా రావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.

అటు పోలీసులు, ఇటు అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పులి కనిపిస్తే దాడి చేయడం వంటివి చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. అటు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు సైతం పులి సంచారం గురించి మానిటరింగ్ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులి రోజుకొక మండలం దాటి వెళ్తోంది. దాంతో అది ఎటువైపు వెళ్తుందా అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు.