Bhavani Deeksha
Bhavani Deeksha Relinquishment: ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవాని దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు దీక్ష విరమణలు జరగనున్నాయి. ఇవాళ తొలిరోజు ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్నిప్రతిష్టాపన చేశారు. కూలైన్లలో వేచిఉన్న భక్తులు మల్లికార్జున మహామండపం దిగువన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపన చేశారు. అనంతరం దుర్గమ్మ దర్శనం ప్రారంభమైంది. రాత్రి 11గంటల వరకు భవవానీ దీక్షధారులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన నాలుగు రోజులు వేకువజామున 4గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గిరి ప్రదక్షిణ చేసన భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
Also Read : ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలిగాలులు…నాలుగు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
నేతి టెంకాయలను సమర్పించి భవాని భక్తులు దీక్షలను విరమణ చేస్తున్నారు. జై దుర్గా జైజై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ప్రత్యేక కౌంటర్లలో గురుభవానీల సమక్షంలో ఇరుముడులను భవానీలు సమర్పిస్తున్నారు. మూడు షిప్టుల్లో 300 మంది గురు భవానీలు ఉన్నారు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు 20లక్షల లడ్డూలను భవానిలకు అందుబాటులో ఉంచారు. దాదాపు పది కిలోమీటర్ల మేర భవానిలు గిరి ప్రదక్షిణ గావిస్తున్నారు. భవానీలకు ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Also Read : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా స్వీకరణ ప్రారంభం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు
ఈనెల 7వ తేదీ వరకుసాగే భవానీ దీక్షల విరమణ క్రతువు కార్యక్రమానికి సుమారు అయిదు లక్షల మంది దీక్షధారులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీలు గిరి ప్రదక్షిణ చేసి వినాయకుడి గుడి నుంచి దర్శనం క్యూలైన్లో ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇరుముడిని అమ్మవారికి సమర్పించిన భక్తులు మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి, అక్కడి నుంచి హోమగుండాల్లో నేటి కొబ్బరికాయను సమర్పించిన తరువాత గురుస్వామి వద్ద మాలతీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది.
నేటి నుంచి 7వ తేదీ వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా కమీషనరేట్ నుంచి మొత్తం 4200 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగనున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపుకు భారీ, మధ్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపు ఉంటాయి. ఇబ్రహింపట్నం నుంచి జికొండూరు – మైలవరం – నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు వాహనాలు మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి చెన్నై, చెన్నై నుంచి విశాఖపట్నం వైపుకు భారీ, మధ్యతరహా రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ -పామర్రు- అవనిగడ్డ-రేపల్లె- బాపట్ల – చీరాల -త్రోవగుంట -ఒంగోలు జిల్లా మీదుగా మళ్లిస్తారు. అలాగే గుంటూరు, చెన్నై రహదారిమీదుగా కూడా మళ్లింపులు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ మేరకు సూచనలు పాటించాలని అధికారులు తెలిపారు.