ఆవుల కళ్లల్లో నుంచి రక్తం..అందరిలో భయం

అకస్మాత్తుగా ఆవుల కళ్లల్లో నుంచి రక్తం కారుతుండడంతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వాటి శరీరంపై ఎర్రటి మచ్చలు కూడా ఉండడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అసలే కరోనా వ్యాపిస్తుండడంతో అందరిలో ఎదో తెలియని భయం నెలకొంది. జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరకు వైద్యులు వచ్చి అసలు ఆవులకు అలా ఎందుకు జరిగిందనే తేల్చారు. అసలు విషయం తెలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు తీసుకొంటోంది. 2020, ఏఫ్రిల్ 22వ తేదీ బుధవారం కొండపల్లి గ్రామంలో ఆవుల కళ్లల్లో నుంచి రక్తం రావడం గమనించారు గ్రామస్థులు. ఆవుల శరీరంపై ఎర్రటి మచ్చలున్నాయి. ఇలా ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 70 ఆవుల్లో ఇలాంటి పరిస్థితి కనిపించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైద్యులకు తెలియచేశారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పశు వైద్యులు..ఆవులను పరిశీలించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాటికి పొంగు వ్యాధి ఉందని నిర్ధారించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు తెలియచేశారు. పొంగు అంటు వ్యాది అని, ఒక ఆవు నుంచి మరొక ఆవుకు వస్తుందని తెలిపారు. వారం రోజుల పాటు ఆవులకు చికిత్స చేయాల్సి ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక అందరూ భయపడుతున్నట్లుగా..ఆవుల నుంచి కరోనా వ్యాధి రాదని చెప్పారు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.