Botsa Family : చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి.. ఎంపీగా పోటీ చేస్తారా?

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి బొత్స సత్యనారాయణ.. సొంత జిల్లా విజయనగరం రాజకీయమంతా తన మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించేశారు.

Botsa Family : చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి.. ఎంపీగా పోటీ చేస్తారా?

Botsa Satyanarayana family politics

Updated On : August 18, 2023 / 1:03 PM IST

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రలో కీలక మంత్రి బొత్స పోటీపై సస్పెన్స్ నెలకొంది. చీపురుపల్లి (Cheepurupalli) ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన మంత్రి బొత్స.. మళ్లీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని.. ఆయన స్థానంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasarao) అలియాస్ చిన్నశ్రీను బరిలో దిగుతారనే టాక్ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. బొత్స సొంత మేనల్లుడైన చిన్నశ్రీను (Chinna Srinu) చాలాకాలం తెరచాటు రాజకీయానికే పరిమితమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నీతానై వ్యవహరిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో చిన్నశ్రీనును ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తోన్న వైసీపీ.. బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలోనే పోటీకి పెట్టాలని నిర్ణయించడమే ఉత్కంఠకు దారితీస్తోంది.. చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి? మామను ధిక్కరించి చిన్నశ్రీను పోటీ చేస్తారా?

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి బొత్స సత్యనారాయణ.. సొంత జిల్లా విజయనగరం రాజకీయమంతా తన మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించేశారు. కాంగ్రెస్ హయాంలో బొత్స మంత్రిగా ఉండగా.. ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, సోదరుడు అప్పలనరసయ్య, మరో బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసినా.. వీరి తరపున జిల్లాలో రాజకీయం నడిపింది చిన్న శ్రీను ఒక్కరే.. బొత్సకు నీడ నేతగా ఎదిగిన చిన్నశ్రీను తెరచాటు రాజకీయం నడపడంలో దిట్టగా గుర్తింపు తెచ్చుకున్నారు. మామ బొత్సపై ఈగ వాలనీయకుండా రాజకీయం చేయడంలో చిన్నశ్రీనుకు సాటిలేరనేది విజయనగరం జిల్లా టాక్.. ఐతే ఇప్పుడు అదే చాణక్యం మామకు ఎర్త్ పెట్టేలా మారిందని అంటున్నారు.

జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన చిన్నశ్రీనును వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చిన్నశ్రీను రాజకీయంగా జిల్లాపై మంచి పట్టుసాధించారు. జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో కలిసి జిల్లా మొత్తం తిరిగారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న చిన్నశ్రీను.. జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. ఇక వచ్చే ఎన్నికల్లో సీనియర్లను ఎంపీలుగా పంపి.. కొత్తవారిని ఎమ్మెల్యేలు చేయాలని నిర్ణయించిన వైసీసీ.. బొత్సను విజయనగరం ఎంపీగా పంపి.. ఆయన స్థానంలో చిన్నశ్రీనును పోటీకి పెట్టాలని ప్రయత్నించడమే హాట్‌టాపిక్ అవుతోంది.

Also Read: బెజవాడ బ్యాచ్‌పై చంద్రబాబు అసంతృప్తి.. యువగళం పాదయాత్ర కుదింపు.. రగిలిపోతోన్న లోకేశ్!

ఐతే చిన్నశ్రీను మాత్రం మామను తప్పించి తనకు సీటు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధపడతారా? అన్నదే సస్పెన్స్‌గా మారింది. జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపే చిన్నశ్రీను చీపురుపల్లితోపాటు శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాల్లోనూ పోటీ చేసినా గెలుస్తారనే ధీమా కనబరుస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉన్నా.. ఈ మూడింట్లో ఏ సీటు అన్నదే తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎస్.కోట నుంచి పోటీకి అవకాశం లభించినా, వద్దనుకున్న చిన్నశ్రీను ఇప్పుడు పోటీకి రెడీ అవ్వడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Also Read: గల్లా కుటుంబం తరుఫున ఎవరుపోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!