విన్నపాలు వినవలె : జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు

  • Publish Date - February 15, 2020 / 06:20 PM IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2020, ఫిబ్రవరి 15వ తేదీ శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన జగన్ .. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల అంశంపై చర్చించారు. అటు జగన్‌ అభ్యర్థనల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపే లక్ష్యంగా జగన్ ఢిల్లీలో పర్యటించారు. మండలిని రద్దు చేసేలా న్యాయశాఖ ఆదేశాలివ్వాలని శుక్రవారం అమిత్‌ షాను కలిసిన సంగతి తెలిసిందే. అమిత్‌ షా సలహా మేరకు శనివారం కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు జగన్‌. శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరారు.

కర్నూలును జ్యుడిషియల్‌ కేపిటల్‌గా చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలన్నది రాయలసీమ ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. పాలన వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని రవిశంకర్‌ ప్రసాద్‌కు వివరించారు జగన్.

మూడు రాజధానుల ఏర్పాటు, శాసనమండలి రద్దు పై కేంద్రం సానుకూలంగా స్పందించిందని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దు బిల్లు పార్లమెంట్ రెండవ సెషన్‌లో ప్రవేశపెట్టే అంశంపై పరిశీలించడంతో పాటు.. పోలవరం నిర్మాణం కోసం పూర్తి సహాయ సహకారం అందిస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందంటున్నారు. అటు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన  చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల దగ్గర కేవలం ఏపీ సమస్యలపైనే చర్చించారా లేక మరేవైనా రాజకీయ అంశాలను మాట్లాడారా అన్న విషయంపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Read More : బోల్ట్‌ను తలపిస్తున్న శ్రీనివాసగౌడ : మహీంద్ర ట్వీట్‌కు కిరణ్ రిజిజు స్పందన