ఆ అధికారులకు చంద్రబాబు షాక్ ట్రీట్‌మెంట్..! అధికారం చేపట్టకముందే తన మార్క్ నిర్ణయాలు

కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆ అధికారులకు చంద్రబాబు షాక్ ట్రీట్‌మెంట్..! అధికారం చేపట్టకముందే తన మార్క్ నిర్ణయాలు

Updated On : June 6, 2024 / 6:08 PM IST

Chandrababu Naidu : బంపర్ మెజార్టీతో గెలిచారు. మరో 6 రోజుల్లో అధికారం చేపట్టనున్నారు. అంతకుముందే పాలనపై పట్టు సాధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. ఇప్పటి నుంచే తన మార్క్ నిర్ణయాలు
తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు షాక్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. చంద్రబాబును స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేసిన సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తనను కలవడానికి వచ్చిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును కలిసేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. కొల్లి రఘురామిరెడ్డి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ అనుమతి నిరాకరించింది.

ఆ అధికారులకు నో లీవ్స్.. నో రిలీవ్స్…
ఇక ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ఆదేశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం తిరస్కరించింది.

కాంట్రాక్టర్లకు నిధుల నిలిపివేత, కీలక డాక్యుమెంట్లు భద్రపరచాలని ఆదేశం..
మరో కీలక పరిణామం కూడా జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండటంతో అమరావతిలోని సచివాలయంలో కీలక డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు. అంతేకాదు కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూముల కేటాయింపు, అధికారుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు.

మంత్రుల పేషీల్లోని రికార్డులను కూడా భద్రపరచాలని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో జవహర్ రెడ్డి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. సెలవుపై వెళ్లాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

టీచర్ల బదిలీలు నిలిపివేత..
రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్ కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపటొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు సచివాలయంలోని మంత్రుల చాంబర్లను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్(జీఏడీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రుల నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం జీఏడీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Also Read : ఏపీ క్యాబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ..! మంత్రి పదవులు దక్కేదెవరికి? పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా?