Andhra Pradesh : చిత్తూరులో లక్షల టన్నుల బంగారం ఖనిజ నిల్వలు.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఏపీ దశ తిరిగినట్లే..
Andhra Pradesh : చిత్తూరు జిల్లా చిగురుగుంట-బి. సానత్తం బంగారు గనులను దక్కించుకునేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఈ-వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా.
Chigurugunta-Bisanattam gold block in Andhra Pradesh Chittoor district
Andhra Pradesh : కర్నూలు జిల్లా జొన్నగిరిలోని బంగారు గనిలో విజయవంతంగా బంగారం ఉత్పత్తి మొదలైంది. దీంతో రాష్ట్రంలో మరో భారీ బంగారు గని అభివృద్ధికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.. చిత్తూరు జిల్లా చిగురుగుంట-బి. సానత్తం బంగారు గనులను దక్కించుకునేందుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఈ-వేలంలో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ గనుల్లో సుమారు 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. మొత్తం 12,500 కిలోల వరకు బంగారం వెలికితీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ గనులను నేరుగా ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఏపీకి ఆర్థికంగా భారీగా స్థాయిలో మేలు జరిగే అవకాశాల ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read : Andhra Pradesh : ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రూ. 71,602 కోట్ల పెట్టుబడులు.. 14250 మందికి ఉద్యోగావకాశాలు..
చిగురుగుంట-బి సానత్తంలో 22లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. టన్ను ఖనిజాన్ని తవ్వితీసి శుద్ధి చేస్తే సగటున 5.64గ్రాముల బంగారం వస్తుందని అంచనా వేశారు. దీంతో ఈ గని నుంచి 12,500 కిలోల బంగారాన్ని వెలికితీయొచ్చునని అధికారులు భావిస్తున్నారు.
అయితే, ఇక్కడ గతంలో భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. 2001 సంవత్సరంలో తవ్వకాలను నిలిపివేశారు. 2018లో నిర్వహించిన ఈ-వేలంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ ఎండీసీ) వీటిని దక్కించుకుంది. అయితే, కొన్ని ఇబ్బందల వల్ల లీజును వదలుకుంది. ప్రస్తుతం ఇక్కడి గనులకు టెండర్లు పిలిచారు. దీంతో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ గనుల లీజును ఏపీఎండీసీ దక్కించుకొని బంగారం వెలికితీయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈనెలాఖరు వరకు బిడ్ల దాఖలుకు అవకాశం ఉండగా.. ఈ-వేలంలో పాల్గొనేందుకు ఏపీఎండీసీ సిద్ధమైంది.
కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే..
బంగారం, బొగ్గు, బాక్సైట్ వంటి మేజర్ మినరల్స్ ను వేలం ద్వారా కేటాయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైనా వేలంలో పాల్గొని లీజులు పొందాల్సిందే. అయితే, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని రెండు బొగ్గు బ్లాక్ లకు వేలం లేకుండా సింగరేణికి నేరుగా రిజర్వు చేశారు. ఒడిశాలోనూ ఓ బాక్సైట్ లీజును ఒడిశా ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించారు. దీంతో చిగురుగుంట -బి సానత్తం గనులను వేలం లేకుండా ఏపీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఇక్కడి మైన్స్ ద్వారా ఏపీఎండీసీకి ఆర్థికంగా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
