Cm Chandrababu : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చాలని నిర్ణయించారు.

CM Chandrababu, Pawan Kalyan

Cm Chandrababu : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సీఎం చాంబర్ లో దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైనా డిస్కస్ చేశారు. బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు.

Also Read : ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం..

అసెంబ్లీ సెషన్స్ జరిగేటప్పుడే చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటూ వెళ్లారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న సీఎం చాంబర్ కి ఇద్దరూ కలిసి వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా గంట పాటు చర్చించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తోంది. తల్లికి వందనం, ఫ్రీ బస్, పీ 4 అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. త్వరలీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకుంది.

వీటన్నింటికి సంబంధించి నిధుల కేటాయింపు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ఇరువురూ చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చాలని నిర్ణయించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు, పవన్ డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని గురించి ఇరువరూ చర్చించుకున్నారట.

మండలిలో ఖాళీగా ఉన్న 5 స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. జనసేనకు ఒక సీటు ఇస్తామని పవన్ కల్యాణ్ కు గతంలోనే హామీ ఇచ్చారు చంద్రబాబు. పవన్ సోదరుడు నాగబాబు మంత్రివర్గంలో చేరాలంటే ఎమ్మెల్సీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఒక స్థానం జనసేనకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

మిగిలిన నాలుగు స్థానాల్లో కూటమి తరపున బీజేపీ కూడా అడుగుతున్నట్లుగా సమాచారం. కానీ, చంద్రబాబు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద పేర్లు ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కుల, ప్రాంత సమీకరణాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.

Also Read : జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

బీసీలకు పెద్ద పీట వేయాలని ఆలోచిస్తున్నారు. మాల, మాదిగలో ఒకరికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒకరికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన. పొత్తు నేపథ్యంలో సీట్లు త్యాగం చేసిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉందంటున్నారు. ఈ లెక్కన బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక మోపిదేవికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీద రవిచంద్ర చాలా కాలంగా పార్టీలో కీలక ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, పీతల సుజాత, బీటీ నాయుడు రేసులో ఉన్నారు. కుల సమీకరణలో భాగంగా బీటీ నాయుడికి మరోసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, గత ఐదేళ్లుగా పార్టీకి సేవ చేశారు, ఆ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి బీటీ నాయుడు అయితే బాగుంటుంది అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. చంద్రబాబు అరెస్ట్ సమయంలో న్యాయవాది హోదాలో రెగులర్ గా జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించారు బీటీ నాయుడు. అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి చాలా మంది ఆశావహులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపికలో కుల సమీకరణాలే ప్రధానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ఆలోచిస్తోంది.