రూ.36 కోట్లతో జంగిల్ క్లియరెన్స్.. శరవేగంగా అమరావతి నిర్మాణ పనులు

నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం దేశ విదేశీ సంస్థలు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు.

Amaravati Construction Works : ఏపీ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతికి కొత్త రూపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. 36 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో 24 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టింది. ఇటు గత నిర్మాణాలను ఇప్పటికే ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. నిర్మాణాలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నిపుణుల బృందం సలహాల మేరకు అమరావతికి న్యూ లుక్ తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం దేశ విదేశీ సంస్థలు, ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు.

ఏపీ రాజధాని అమరావతిలో నిన్నటి నుంచి అన్ని పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ భూమి పూజ చేసి అమరావతి నిర్మాణానికి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. దాదాపు 36 కోట్ల రూపాయల వ్యయంతో 24వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున మొలిచిన పిచ్చి మొక్కలు, కంప చెట్లను తొలగించే పనిని స్టార్ట్ చేశారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే జంగిల్ క్లియరెన్స్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గడిచిన ఐదేళ్లలో దాదాపుగా అడవిని తలపించేలా ఆ ప్రాంతం తయారైంది.

రాజధాని అమరావతి కోసం రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారు. అందులో 24వేల ఎకరాలకుపైగా అడవిని తలపిస్తోంది. పెద్ద పెద్ద చెట్లు, పిచ్చి మొక్కలు, కంప చెట్లతో అరణ్యంగా మారిన పరిస్థితి ఉంది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఇప్పటికే పూర్తైన నిర్మాణాల స్థితిగతులు, కొత్తగా నిర్మాణాలు చేయబోయే వాటి గురించి దశలవారీగా పూర్తి స్థాయిలో సీఆర్డీయే అధికారులు, నిపుణులతో సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

రెండు సంవత్సరాల వ్యవధిలోనే అమరావతిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. అటు కేంద్రం కూడా బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15వేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి మరింత సహకారం, సాయం అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లను చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి మిగతా నిర్మాణాలు, సంస్థలకు భూముల కేటాయింపులు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టనుంది చంద్రబాబు సర్కార్.

Also Read : వైసీపీని వీడి మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు నేతలు..!

ట్రెండింగ్ వార్తలు