Thalliki Vandanam : తల్లికి వందనం చెల్లింపుపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. విద్యార్థి హాజరు శాతం బట్టి చెల్లింపు చేసే నిబంధనను అధికారులు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపు ఈ విద్యా సంవత్సరం హాజరు శాతం ఆధారంగా తల్లికి వందనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
జగన్.. అమ్మఒడి పేరుతో ప్రతీ ఏటా ఎంతో కొంత కోత పెట్టారని మంత్రులు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇద్దామని మంత్రులతో సీఎం చంద్రబాబు చెప్పారు.
అటు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. చేస్తున్నాం, చూస్తున్నాం అనే సమాధానాలతో కాలయాపన చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఉన్నంత ఓపిక నష్టపోయిన ప్రజలకు ఉంటుందా అని నిలదీశారు. ఎన్ని చేయగలిగాము అనే లక్ష్యంతో వీలైనన్ని సమస్యలు పరిష్కరించాల్సిందేనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
అర్జీల జిరాక్సుల కోసమే బాధితులు వందలాది రూపాయల భారం మోయాల్సి వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఒక చోట అర్జీ ఇచ్చాక మరొక చోట కూడా ఇవ్వాలంటూ బాధితులను తిప్పటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రులు.
Also Read : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి ఆమోదముద్ర
అటు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలకు ఆమోద ముద్ర వేసింది. అమరావతిలో 2వేల 733 కోట్ల రూపాయల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను ఆమోదించినట్లు వివరించారు. భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.
తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకలకు పెంచడంతో పాటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే వచ్చే ఎడాది నుంచి తల్లికి వందనం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు.