పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Updated On : December 23, 2020 / 10:19 AM IST

Family Doctor System in Villages : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెల్లో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీ అమలుపై ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లు ఉండాలని, మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని చెప్పారు. ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలన్నారు. ప్రతి నెల కనీసం రెండు సార్లు ఆ గ్రామాలకు వెళ్లి డాక్డర్‌ వైద్యం అందించాలని తెలిపారు. అప్పుడే గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాలపై డాక్టర్లకు అవగాహన కలుగుతుందని చెప్పారు. కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని సూచించారు.

ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల కోసం ఏకంగా రూ.16,270 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. నిధులు కూడా ఇచ్చేలా చూడాలని చెప్పారు. నాడు–నేడు కింద కొత్తగా చేపట్టే మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన సాగాలని సూచించారు. మార్చి 31 నాటికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ల పనులు జనవరి నెలాఖరు కల్లా ప్రారంభం కావలని,నిర్మాణాలు పూర్తయ్యాక జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రులను నడపాలని తెలిపారు.

నిరంతరం ఆ ప్రమాణాలు పాటించేలా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు రోగికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. 104 నంబర్‌కు ఫోన్‌ చేస్తే.. ఎక్కడికి వెళ్లాలన్న దానిపై పేషెంట్‌కు అవగాహన కల్పించాలి. పేషెంట్‌ తన గ్రామం, మండలం పేరు చెప్పగానే.. అందుబాటులో ఉన్న రిఫరల్‌ ఆస్పత్రులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు చెప్పాలి. ఆరోగ్య సిబ్బంది ద్వారా సరైన సహాయం, సహకారం అందించేలా చూడాలని సమీక్షలో జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆరోగ్యశ్రీ అమలు తీరును, కార్డుల పంపిణీ, ఆరోగ్య ఆవసరాలపై సీఎం సమీక్షించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగులో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య ఆసరా కింద ఇప్పటి వరకు 836 ప్రొసీజర్లకు ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అదనంగా 638 ప్రొసీజర్లకు కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల మాదిరిగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు.