మండలికి మంగళం : సీఎం జగన్ నిర్ణయం రైటా..? రాంగా..?

తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 03:30 PM IST
మండలికి మంగళం : సీఎం జగన్ నిర్ణయం రైటా..? రాంగా..?

Updated On : January 27, 2020 / 3:30 PM IST

తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా

తండ్రి ఆశయాలు నెరవేరుస్తా.. ఆయన బాటలోనే నడుస్తా.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆయన కీర్తిని నిలబెడతా అన్నారు. కానీ, ఆ ఒక్క విషయంలో మాత్రం తండ్రిని కాకుండా ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. అసెంబ్లీ నిర్ణయాలకు అడ్డుపుల్లగా మారిన దానిని తొలగించుకున్నారు. కానీ, ఇక్కడే తండ్రి బాటను కాదని పక్కదారిలో వెళ్తున్నట్టు గ్రహించలేకపోతున్నారు. 

రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు దూరమైన శాసనమండలిని అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కష్టపడి పునరుద్ధరించారు. ఇప్పుడు అదే మండలిని రద్దు చేశారు తనయుడు వైఎస్‌ జగన్‌. పెద్దల సభగా గుర్తింపు పొందిన ఈ సభ ఎప్పుడూ సంచలన రాజకీయాలకు వేదికగానే నిలుస్తోంది. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలపై సలహాలు ఇచ్చేందుకు మండలి వ్యవస్థ ఏర్పాటైంది. కానీ, సభలో ఎవరికి బలం ఉంటే వారికి ఉపయోగకరంగా మారిందనేలా తయారైందంటున్నారు. మూడు రాజధానుల బిల్లు విషయంలో తనకు తలనొప్పిగా మారిన మండలిని రద్దు చేసేస్తే బెటర్‌ అనే ఆలోచనలో జగన్‌ ఉన్నారు. 

ఎన్టీఆర్‌ సీఎం అయ్యాక మండలి, అసెంబ్లీ మధ్య పొరపొచ్చాలు:
ఏపీ మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం ఇదే తొలిసారి కాదు. 1985లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం.. శాసన మండలిని రద్దు చేసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసనమండలిని.. ఆయన తనయుడు జగన్‌ మరోసారి రద్దు చేశారు. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఏర్పాటైంది. 1983 వరకూ కాంగ్రెస్‌ పార్టీ పాలనే సాగడంతో.. శాసససభ, మండలి కార్యకలాపాలు సజావుగానే సాగాయి. అయితే, 1983లో ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం అధికారంలోకి రావడంతో.. అసెంబ్లీకి, మండలికి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. 

1985లో 2 నెలల్లోనే మండలి రద్దుకి కేంద్రం ఆమోదం:
అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉండడంతో మండలిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 30, 1985న తీర్మానం చేయించారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయ సభల్లోనూ ఆమోదించింది. దీనికి జూన్ ‌1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయ్యింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. మళ్లీ మండలి పునరుద్ధరణకు ప్రయత్నించింది. జనవరి 22, 1990న శాసనసభలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయినా, లోక్‌సభ రద్దు కావడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వాలేవీ ఈ బిల్లును పట్టించుకోలేదు.

తండ్రి ఎస్.. తనయుడు నో:
2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ మండలి పునరుద్ధరణ దిశగా అడుగులు పడ్డాయి. జులై 8, 2004న మండలి పునరుద్ధరించే తీర్మానాన్ని శాసనసభలో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం ఆమోదించింది. దీనికి డిసెంబర్‌ 15, 2005న లోక్‌సభ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 20న రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. దీంతో జనవరి 10, 2006న ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు అంగీకరిస్తూ రాష్ట్రపతి సంతకం చేశారు. 1985లో రద్దైన మండలి.. మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. తన తండ్రి పునరుద్ధరించిన మండలినే ఇప్పుడు తనయుడు జగన్‌ రద్దు చేయడం చర్చనీయాంశం అయ్యింది. 

వారికి జగన్ ఏం సమాధానం చెబుతారు?
అన్ని విషయాలు తన తండ్రి పాలన అంటూ ఆదర్శంగా తీసుకొనే జగన్‌.. ఇప్పుడు తన పంతం నెగ్గించుకోవడానికి శాసనమండలిని రద్దు చేశారని డిస్కస్‌ చేసుకుంటున్నారు. మండలి రద్దు చేసి బిల్లులను క్లియర్‌ చేసుకోవాలనే ఆయన చూస్తున్నారు. కాకపోతే ఆయన ముందు కొన్ని అంశాలు పరిశీలనకు వస్తున్నాయట. ఇప్పుడు తమ పార్టీకి మండలిలో 9 మంది సభ్యులున్నారు. వారిలో ఇద్దరు మంత్రులు. వారంతా పదవులు కోల్పోవలసి వస్తుంది. అలానే అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని విపరీతంగా హామీలిచ్చేశారు. వారికి ఏం సమాధానం చెప్పాలన్నది కూడా నిర్ణయించుకోవాల్సి ఉంది. మరి జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని జనాలు అనుకుంటున్నారు.