6 గంటలు చర్చలు : కేసీఆర్, జగన్ చర్చించిన అంశాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత సీఎం జగన్ నేరుగా అమరావతికి వెళ్లిపోయారు. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా కేసీఆర్, జగన్ సమావేశం జరిగింది. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు.. విభజన సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు, జల వనరుల వినియోగం, పోతిరెడ్డిపాడు వివాదం పై చర్చించినట్టు తెలుస్తోంది. 3 నెలల విరామం తర్వాత ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు.
విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చించినట్టు సమాచారం. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్‌లోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై క్షుణ్ణంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో.. అధికారులు, మంత్రులు పాల్గొంటే… ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
* ఏపీ, తెలంగాణ అంశాలపై 6 గంటలు కేసీఆర్, జగన్ చర్చలు
* ఏపీ, తెలంగాణ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని కేసీఆర్, జగన్ నిర్ణయం
* గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించడంపై ఏకాభిప్రాయం
* గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి, ఎలా వినియోగించాలి.. మోడల్ ఎలా ఉండాలి అనే విషయాలపై తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయం
* 9, 10వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయం
* దేశ, స్థానిక రాజకీయాలపై సుదీర్ఘ చర్చ
* సమావేశం నుంచే ఇరు రాష్ట్రాల సీఎస్ లతో మాట్లాడిన సీఎంలు
* విభజన అంశాలు పరిష్కరించే దిశగా త్వరలో సమావేశం కావాలని సీఎస్ లకు సీఎంలు ఆదేశం
Also Read : ఎవరూ అధైర్యపడొద్దు : మళ్లీ మోడీ, చంద్రబాబు, పవన్ కలుస్తారు