CM YS Jagan : వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టిన సీఎం జగన్.. తాడికొండకు అదనపు సమన్వయకర్తగా డొక్కా నియామకం

వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం జగన్. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు.

CM YS Jagan : వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టిన సీఎం జగన్.. తాడికొండకు అదనపు సమన్వయకర్తగా డొక్కా నియామకం

Updated On : August 20, 2022 / 7:58 PM IST

CM YS Jagan : వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం జగన్. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె వర్గం ఆగ్రహంగా ఉంది. డొక్కా నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాగా, వైసీపీ పూర్తి ప్రక్షాళనకు సీఎం జగన్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి యాక్టివిటీ కూడా ఆయన ప్రారంభించారు.

ఇందులో భాగంగా ప్రతీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త ప్రతీ ఒక్కరూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలి, లేని పక్షంలో వాళ్లందరికీ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని పదే పదే సీఎం జగన్ చెప్పడం జరిగింది. దీంతో పాటు సర్వేల రిపోర్టు ఆధారంగా, పనితీరుని మెరుగుపరుచుకున్న వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం ఉంటుందని జగన్ చెప్పారు. అంతేతప్ప మొహమాటం, గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉందని చెప్పి టికెట్లు ఇవ్వడం కుదరదన్నారు. అనేక సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ ఈ విషయం చెప్పారు.

గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షలో కూడా జగన్ ఈ విషయాన్ని ఎమ్మెల్యేలతో చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రక్షాళనను జగన్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి మూడు నెలలు పూర్తవుతోంది. 8 నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే తమ పనితీరు మెరుగుపరుచుకుంటారో వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుందని జగన్ చెప్పారు. ప్రస్తుత చేసిన సర్వేల ప్రకారం దాదాపు 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని వైసీపీ కీలక నేతలు చెబుతూ వస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిపై అనేక వివాదాల్లో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు జగన్. దీంతో టికెట్ మార్చబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. డొక్కాను అదనపు సమన్వయకర్తగా నియమించడాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.

కాగా, ఒక్క తాడికొండ మాత్రమే కాదు.. ఇలాంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయని పార్టీలో ఉన్న కీలక నేతలు చెబుతున్నారు. దానికి సంబంధించి ప్రక్షాళన ప్రారంభమైందంటున్నారు. 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం.