ఏపీలో కరోనా మాత్రం రోజురోజుకు పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 61 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. 1016కి చేరాయి. వైరస్ బాధితుల్లో మరో ఇద్దరు చనిపోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఇప్పటివరకూ 171 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా ప్రస్తుతం 814 మంది కరోనాతో ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ప్రభుత్వం 6 వేల 928 శాంపిల్స్ టెస్టులు జరపగా వారిలో 61 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
కృష్ణా జిల్లాలో 25, కర్నూలు జిల్లాలో 14, అనంతపురం జిల్లా 5, కడప జిల్లా 4, నెల్లూరు జిల్లా 4, శ్రీకాకుళం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. గుంటూరు జిల్లాలో కూడా కేసుల సంఖ్య 209కి చేరింది. అటు కృష్ణా జిల్లాలోనూ 127 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు నమోదుకాని శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకోవడం చాలా అవసరమన్నారు. అత్యధిక కేసులు ఉన్న జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టెలి మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సూచించారు. మిగతా జిల్లాల్లోనూ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.